Banswada BondPaper: బాన్సువాడను జిల్లా చేస్తానంటూ బాండ్‌పేపర్‌పై హామీ
Banswada BondPaper: ఎన్నికల్లో గెలిస్తే బాన్స్‌వాడ నియోజక వర్గాన్ని జిల్లాగా మారుస్తానంటూ ఓ ఇండిపెండెట్ అభ్యర్ధి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బాండ్ పేపర్‌పై ఎన్నికల హామీలను ప్రచారం చేస్తున్నారు.
Banswada BondPaper: నిజామాబాద్ జిల్లాలో బాండ్ పేపర్ హామీలు ట్రెండ్ గా మారాయి. గతంలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డుపై ఈ విధంగానే హామీ ఇచ్చి గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా దీన్నే ఆధారంగా చేసుకుని బాన్సువాడలో స్వతంత్ర అభ్యర్థి పుట్ట భాస్కర్ వినూత్న ప్రచారానికి తెర లేపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనని గెలిపిస్తే బాన్సువాడను జిల్లాగా చేస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు.
మంగళవారం బాన్సువాడ నియోజకవర్గం లో మిర్జాపూర్ గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పుట్ట భాస్కర్ ప్రచారం నిర్వహించారు. నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన తను ఉన్నత విద్య చదివినా నిరుద్యోగినని, ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో బాన్సువాడను జిల్లా కేంద్రంగా మారుస్తానని 100 రూపాయల స్టాంపు పేపర్ పై రాసి ఓటర్లకు చూపిస్తున్నారు.
ఎన్నికల్లో తన గుర్తు చపాతీ మేకర్ - రొట్టెల కర్ర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదిస్తే బాన్సువాడను జిల్లా గా చేసి చూపిస్తానని ప్రత్యక్ష దైవాలుగా బావించే తన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.
ఈ విషయంలో తను ఈ మాట తప్పితే ప్రజలు వేసి ఏ శిక్షకైనా సిద్దమేనని అంటున్నారు. 'ఇది నా ఇష్టపూర్వకముగా వ్రాసిస్తున్న ఒప్పంద పత్రము' అంటూ ప్రచారం చేస్తున్నారు.