N Convention: ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా ఎందుకు కూల్చేసింది.. అసలు కథ ఇదీ!
24 August 2024, 12:45 IST
- N Convention: హైదరాబాద్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే.. అసలు ఎన్ కన్వెన్షన్‌ను ఎందుకు కూల్చారు.. కారణాలు ఏంటి.. 2015 నుంచి ఇప్పటి దాకా ఎలా నడిపించారు అనే చర్చ జరుగుతోంది. అసలు ఎన్ కన్వెన్షన్ కథ ఏంటో ఓసారి చూద్దాం.
ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా ఎందుకు కూల్చేసింది
హైదరాబాద్‌లో టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం అయ్యింది. హైటెక్ సిటీ రోడ్డులో ఉన్న తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల స్థలం కబ్జా చేసి.. ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టారు. తుమ్మిడి చెరువును పూడ్చివేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టుగా గుర్తించారు.
మూడున్నర ఎకరాలు..
మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌లో.. 2 ఎకరాలు బఫర్ జోన్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం నాగార్జున ఒక్కరిదే కాదు. ఎన్ కన్వెన్షన్‌లో హీరో అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతంరెడ్డి భాగస్వాములుగా ఉన్నారు.
కోమటిరెడ్డి లేఖతో..
నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని.. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ హైడ్రాను ఆదేశించారు. దీంతో కోమటిరెడ్డి లేఖపై హైడ్రా కమిషనర్ విచారణ జరిపారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్‌టీఎల్‌లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు మంత్రి లేఖలో వివరించారు. శాటిలైట్ ఫోటోలతో సహా ఇతర ఆధారాలను హైడ్రాకు ఇచ్చారు. కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా.. కూల్చివేతకు రంగం సిద్ధం చేసి నేలమట్టం చేసింది.
వ్యవస్థాపక పార్ట్‌నర్‌గా నాగార్జున..
ఎన్ 3 రియాల్టీ ఎంటర్‌ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ నడుస్తోంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవస్థాపక పార్ట్‌నర్. దీన్నీ పిల్లర్లు లేకుండా హైసీలింగ్‌లో నిర్మించారు. 2 నుంచి 3 వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్ ఉంటుంది. 350 నుంచి 450 మంది కూర్చునేలా డైమండ్ హాల్ నిర్మించారు. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనయన్ హాల్ నిర్మించారు. 2015 ఆగస్ట్ 20 నుంచి ఎన్ కన్వెన్షన్‌లో కార్యకలాపాలు నడుస్తున్నాయి. సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్‌కు దీన్ని అద్దెకు ఇస్తున్నారు.
రేవంత్ రెడ్డికి నాగార్జున ఫోన్..
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో సోషల్ మీడియా షేక్ అవుతోంది. రేవంత్ రెడ్డి పాత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సమయంలోనే హీరో నాగార్జున.. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారనే వార్త సర్క్యులేట్ అవుతోంది. నాగార్జున ఫోన్ చేస్తే.. రేవంత్ రెడ్డి అందుబాటులోకి రాలేదనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మారుమోగుతోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది.