Revanth Reddy on N Convention: ఎన్ కన్వెన్షన్‌పై నాడు నేడు అదే మాట.. దటీజ్ రేవంత్..!
Revanth Reddy on N Convention: హైదారాబాద్‌లోని హైటెక్ సీటి రోడ్డులో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా టీమ్ నేలమట్టం చేసింది. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. రేవంత్ రెడ్డి 2016లో ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని.. దానిపై ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసింది. ఈ ఇష్యూపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ విడియోలో రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని.. దానిపై ఏ చర్యలు తీసుకున్నారని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై నెటిజన్లు రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు ఒకేమాట.. దటీజ్ రేవంత్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
2016లో మిషన్ కాకతీయపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా.. చెరువు ఆక్రమణకు గురవుతున్నాయని.. వాటిని కాపాడటానికి ఏం చర్యలు తీసుకున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు ఉండగా.. కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
'సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవారు. మంచిని ప్రజలకు బోధించేవారు. వాళ్లను ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా చెరువు భూముల్లో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో.. చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టిండ్రు. కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం పదేపదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టీవీ ఛానెళ్లలో, పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున కూడా దీనిపై స్పందించారు. ఈనాటి వరకు కూడా ఎందుకు అక్కినేని నాగార్జున ఆక్రమించుకొని కట్టిన కట్టడాలను తొలగించలేదు. ఏ శక్తులు అడ్డం పడుతున్నాయ్.. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి సూటిగా సమాధానాం చెప్పాలి' అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆక్రమణలు నిజమే..
ఎన్ కన్వెన్షన్‌ను మొత్తం 10 ఎకరాల్లో నిర్మించారు. ఇది ఎఫ్‌టీఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాలు ఉంది. నార్త్ ట్యాంక్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరాల ప్రకారం.. తమ్మిడికుంటలోని ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం 29.24 ఎకరాలు. ఎన్ కన్వెన్షన్ ద్వారా ఎఫ్‌టీఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాలు ఆక్రమణలు జరిగాయి. 2014లోనే మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువులోని 1.12 ఎకరాల ఎఫ్‌టీఎల్, 2 ఎకరాల బఫర్ జోన్‌లో కన్వెన్షన్ హాల్ ఆక్రమణకు గురైనట్లు సర్వేలో తేలింది.
కేవలం రేకుల షెడ్డునే కూల్చారు..
అయితే.. అప్పట్లో చెరువుకు ఎదురుగా ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్‌లోని షెడ్డును మినహా.. జీహెచ్‌ఎంసీ దేన్ని కూల్చివేయలేదు. కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అధికారులు.. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేత మొదలుపెట్టారు.