Revanth Reddy: ఆ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు: రేవంత్ రెడ్డి-cm revanth reddy sensational comments on the nda government ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: ఆ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఆ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు: రేవంత్ రెడ్డి

Basani Shiva Kumar HT Telugu
Aug 22, 2024 04:33 PM IST

Revanth Reddy: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆదానీ, అంబానీలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.

ధర్నాలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
ధర్నాలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

దర్యాప్తు సంస్థల్ని కేంద్రం తమ గుప్పిట్లో పెట్టుకుని.. కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ పార్టీ గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

'గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు. మోదీ అండతోనే సెబీ కుంభకోణంపై ఛైర్మన్ మాధుబి బచ్ రాజీనామా చేయలేదు. స్కాంపై కేంద్రం జేపీసీ వేయలేదు. దీనిపై రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం. దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం. సెబీ స్కాంపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా మలినమైనా మాకు అభ్యంతరం లేదు. సెబీ స్కాంపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇటు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనల పైనా రేవంత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 'పదేళ్లు రైతులను కొళ్లగొట్టిన దొంగలు ఇప్పుడు మళ్లీ గ్రామాలకు వస్తున్నారు. వారిని మీరు ఎలా రానిస్తున్నారు. అసత్యపు ప్రచారం చేస్తూ.. ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. పదేళ్లల్లో మీరు ఇచ్చింది ఎంత.. 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంతో చర్చిద్దాం అమరవీరుల స్తూపం దగ్గరకు రండి. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం ఎందుకు. మోదీ కూడా మీలాగే వాట్సాప్ యూనివర్సిటీలో అసత్య ప్రచారం చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 18 వేల కోట్ల రూపాయులు వేశాం' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Whats_app_banner