BRS Protest : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - తుంగతుర్తిలో రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జ్-stone pelting between brs and congress workers in thungathurthi in suryapet district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Protest : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - తుంగతుర్తిలో రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జ్

BRS Protest : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - తుంగతుర్తిలో రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 22, 2024 04:06 PM IST

సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసులు లాఠీలకు పని చెప్పి…చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

తుంగతుర్తిలో ఉద్రిక్తత
తుంగతుర్తిలో ఉద్రిక్తత

రుణమాఫీ పచ్చి అబ్ధమంటూ బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలను చేపట్టింది. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి బీఆర్ఎస్ శ్రేణులు తిరుమలగిరిలో నిరసన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి.

ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ వర్గానికి చెందిన వారు మరో వర్గంపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. రాళ్ల దాడి ఘటనలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఇందిరమ్మ రాజ్యం ఇదేనా..? - హరీశ్ రావు

తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటన విడుదల చేశారు. “కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గమైన చర్య. సో కాల్డ్ ప్రజాపాలనలో నాయకులు, జర్నలిస్టులపై దాడులు చేస్తారా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ పాలనలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదన్నారు హరీశ్ రావు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గళాలను రేవంత్ సర్కారు అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదని హరీశ్ రావు స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన.. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక, రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసే దాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్….

ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు, విద్యార్థులు, జర్నలిస్ట్ లు, ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రశ్నించినా.. అయితే పోలీసులు లేదంటే మీ గుండాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు.

“హామీలు అమలు చేయాలంటే బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు, దాడులు, కేసులా? ఇందిరమ్మ రాజ్యమంటే ఆనాటి ఎమర్జెన్సీని అప్రకటితంగా అమలు చేయటమేనా? ఇలాంటి తాటాకు చప్పళ్లకు భయపడేదా తెలంగాణా..! గుర్తు పెట్టుకో మిస్టర్ చీ(ప్)ఫ్ మినిస్టర్...ఎంత అణిచివేస్తే అంత ఎదురు తిరగటమే. ఏడాది కూడా తిరగకముందే ఇంత ఫ్రస్ట్రేషనా? ఇది ఆరంభమే...ముందున్నది ముసళ్ల పండగ” అంటూ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

“రుణమాఫీ పై ప్రశ్నిస్తేనే బెదిరిపోతున్నారు, భయపడుతున్నారు. ఇంకా మీ ఆరు గ్యారంటీలు...420 హామీల గురించి అడిగితే ఏమైపోతారో? పరిపాలనంటే పచ్చి బూతులు, పిచ్చి మాటలు అనుకున్నావా? పూర్వాశ్రమంలో ప్రవర్తించినట్లే ప్రవరిస్తే అందలమెక్కించటానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు... తెలంగాణ. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజలు నిన్ను వదలరు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటది. వెంటాడుతది. వేటాడుతది. ఈ దాడులు, దౌర్జన్యాలు, కేసులు, బెదిరింపులు బీఆర్ఎస్ కు కొత్త కాదు. ఈ నీకన్నా తీస్ మార్ ఖాన్ లే ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆగమైపోయిన్రు. మీ కాంగ్రెస్ కు ఇచ్చిన హానీమూన్ సమయం అయిపోయింది. ఇక ప్రజా క్షేత్రంలో మిమ్నల్ని కడిగేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. అధికార పక్షమైనా...ప్రతి పక్షమైన ప్రజలకోసమే. మా పోరాటం మాత్రం ఆగదు”అని కేటీఆర్ స్పష్టం చేశారు.