Rythu Runa Mafi : అర్హులైనా రుణమాఫీ కాలేదా...? ఈ ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోండి-grievance cells on rythu runa mafi issues in mandal centres ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Runa Mafi : అర్హులైనా రుణమాఫీ కాలేదా...? ఈ ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోండి

Rythu Runa Mafi : అర్హులైనా రుణమాఫీ కాలేదా...? ఈ ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 21, 2024 11:10 AM IST

రుణమాఫీ ప్రక్రియలో ఇబ్బందులను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించింది. వీరంతా రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అయితే కుటుంబ నిర్ధారణతో పాటూ రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం వారి విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

రైతు రుణమాఫీ
రైతు రుణమాఫీ

తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీని డెడ్ లైన్ గా పెట్టుకున్నప్పటికీ… పలు కారణాలతో చాలా మంది రైతులకు మాఫీ జరగలేదు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. మంగళవారం నుంచే వీరు అందుబాటులోకి వచ్చారు.

ప్రతి మండల కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నోడల్ అధికారులు… రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదుల వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులకు రిపోర్ట్ చేస్తున్నారు. 

రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదుల వివరాలను తెలుసుకునేందుకు హిందుస్తామ్ టైమ్స్ తెలుగు… రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ నోడల్ అధికారిణితో ప్రత్యేకంగా మాట్లాడింది. రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు పలు అంశాలపై వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది.

మంగళవారం నుంచి రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నట్లు నోడల్ అధికారిణి చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రైతుల నుంచి వీటిని స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ఆధార్ కార్డు, పట్టా పాస్ పుసక్తం, బ్యాంక్ ఖాతా పుస్తకంతో పాటు ఇతర పత్రాలను తీసుకుంటున్నామని వివరించారు. ఫిర్యాదు స్వీకరించేందుకు ప్రత్యేక ఫామ్ అంటూ ఏం లేదని చెప్పారు. రుణమాఫీ కాని రైతుల వివరాలతో పాటు వారి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు.  ఆధార్ కార్డు సరిగా లేకపోతే అలాంటి వారి నుంచి ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ ను తీసుకుంటున్నామన్నారు.

రుణమాఫీ ప్రక్రియలో కుటుంబ నిర్ధారణ కీలకంగా మారింది. ఇలాంటి సమస్యలున్న వారి నుంచి ప్రధానంగా ఆధార్ కార్డులను స్వీకరిస్తున్నట్లు నోడల్ అధికారిణి పేర్కొన్నారు. పైనుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే  కుటుంబ నిర్ధారణ ఎలా అనే అంశంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక  రూ.రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక షెడ్యూల్ వస్తుందని వివరించారు. మరో నాలుగైదు రోజుల్లో దీనిపై ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తమకు వచ్చే వివరాలన్నింటిని పోర్టల్ ద్వారా అప్ లోడ్ చేసి పై అధికారులకు పంపుతున్నామని చెప్పారు.

రైతు రుణమాఫీ అమలు కాకపోవడానికి ఉన్న కారణాలను బట్టి దానికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందచేస్తే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాశాఖ స్పష్టం చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని చెబుతోంది. ఇబ్బందులు ఉన్న రైతులు వెంటనే రైతు వేదికల్లో అందుబాటులో ఉన్న నోడల్ అధికారులను కలవాలని సూచిస్తోంది.