N Convention Demolition : హైడ్రా దూకుడు..! హీరో నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చివేత-demolition of n convention in madapur hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  N Convention Demolition : హైడ్రా దూకుడు..! హీరో నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చివేత

N Convention Demolition : హైడ్రా దూకుడు..! హీరో నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చివేత

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 24, 2024 10:14 AM IST

హైదరాబాద్ మాదాపూర్‌లోని ‘ఎన్‌ కన్వెన్షన్‌’ కూల్చివేత ప్రారంభమైంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను ‘హైడ్రా’ అధికారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఫిర్యాదు అందటంతో చర్యలు చేపట్టారు.

మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్  కూల్చివేత
మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ ను కూల్చివేసే పనులను శనివారం ఉదయం ప్రారంభించింది.

తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందటంతో కూల్చివేత పనులను ప్రారంభించారు.  మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఎన్-కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో నిర్మించబడి ఉంది. 

ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు కూడా అందాయి. గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ జరగలేదు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. 

ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, బఫర్ జోన్ పరిధిలోని స్థలాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అథారిటీ) ప్రధానంగా ఫోకస్ పెట్టింది.  గతంలో ఉన్న చెరువుల మ్యాప్ లను పరిశీలించి… చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.  చెరువుల చుట్టూ వెలసిన కాలనీలు, ఎఫ్డీఎల్ పరిధిలోకి వచ్చే ప్లాట్లు, ఆక్రమణలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. 

ఈ నేపథ్యంలోనే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై కూడా హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఏ క్షణమైనా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇటీవలే జోరుగా వార్తలు వినిపించాయి. అనుకున్నట్లే ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ వద్దకు చేరుకున్నారు. యంత్రాల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్ లోకి వెళ్లే దారులను కూడా మూసివేశారు. లోపలికి కూడా ఎవర్నీ అనుమతించటం లేదు. ఎంత వరకైతే ఆక్రమణ జరిగిందో అక్కడి వరకు కూల్చివేయనున్నారు. 

హైడ్రా పరిధి ఏంటి..?

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి హైడ్రా కిందకే వచ్చాయి. ప్రస్తుతం దీనికి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. 

హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్​మెంట్​, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా హైడ్రా వ్యవహరించనుంది.  జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించే అవకాశం కూడా ఉంది.  నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించేలా హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారు. 

బఫర్ జోన్ లో భవనాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవలే మీడియాతో మాట్లాడారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 400కు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయని . ఎన్‌ఆర్‌ఎస్‌సీ నివేదిక ప్రకారం గడిచిన 44 ఏళ్లలో నగరంలో చాలా చెరువులు కనుమరుగయ్యాయన్నారు. చాలా చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. అలాంటి అక్రమ కట్టడాలు గుర్తించి వాటిని తొలగిస్తు్న్నామన్నారు. 

బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే హైదరాబాద్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందన్నారు. హైడ్రా పరిధిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి అని తెలిపారు. అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ ఆక్రమణలకు గురైయ్యాయని తెలిపారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు కూడా పూడుకుపోయాయన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ప్రజలు స్థలాలు కొనుగోలు చేయొద్దని ప్రజలను కోరారు.

 

టాపిక్