BRS vs Congress : కరెంట్ మంటలు... BRSకి సరికొత్త అస్త్రం... సైలెంట్ మోడ్‌లో 'హస్తం' నేతలు!
12 July 2023, 14:28 IST
- Telangana Politics: తెలంగాణలో కరెంట్ పంచాయితీ గట్టిగా నడుస్తోంది. విదేశాల్లో ఉన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన వేళ… బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. అయితే కారు పార్టీ నేతల వ్యాఖ్యలను… తిప్పికొట్టడంలో హస్తం నేతలు దూకుడు ప్రదర్శించటం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి కామెంట్స్... బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
BRS vs Congress : తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉచిత పథకాలపై కొన్ని కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా... రైతుల కరెంట్ పై మాట్లాడారు. కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ... కేవలం 3 గంటలు ఇస్తే సరిపొతుందంటూ చెప్పుకొచ్చారు. ఇది కాస్త... తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వేడిని సృష్టించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు బీఆర్ఎస్ నేతలు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ... రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అంటూ ఆందోళనలు చేపట్టారు.
కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కీలక నేతలను తమవైపు తిప్పుకునే పనిలో పడింది. ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టి విజయవంతం చేసింది. త్వరలోనే కొల్లాపూర్ వేదికగా ప్రియాంక గాంధీని సభను తలపెట్టి... మరిన్ని చేరికలను చేయాలని చూస్తోంది. డిసెంబర్ లో తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాను కూడా కేడర్ లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఓ దశలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వేస్తున్న అడుగులపై కన్నేసి ఉంచింది. పెద్దగా బీజేపీని పట్టించుకోకుండా.... హస్తం పార్టీపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టే పనిలో పడింది. చేరికల వ్యవహారాన్ని పరిశీలిస్తూనే.... రివర్స్ గా ఎలా కౌంటర్ ఇవ్వాలనే దిశగా ప్లాన్ చేస్తోంది. సరిగ్గా ఈ టైంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ కాస్త సరికొత్త అస్త్రంగా దొరికినట్లు అయింది. తాము రైతులకు ఉచితంగా 24 కరెంట్ ఇస్తున్నామని... కాంగ్రెస్ వస్తే 3 గంటలే ఇస్తారని, అదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది. రేవంత్ రెడ్డి అలా కామెంట్స్ చేసిన కొద్ది సమయం వ్యవధిలోనే... సోషల్ మీడియాలో వీడియోలను తెగ వైరల్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆర్మీ. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ దిష్టిబోమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. మంగళవారం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టగా... ఇవాళ కూడా అదే పని మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కేసీఆర్ నినాదం.. మూడు పంటలు. కాంగ్రెస్ విధానం.. మూడు గంటలు. బీజేపీ విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? అనేది రైతులు తేల్చుకోవాలి. తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణమిది’’ అంటూ కేటీఆర్ ఓ ట్వీట్ ను కూడా వదిలారు.
సైలెంట్ మోడ్ లో కీలక నేతలు...
పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీరియస్ గా కార్నర్ చేస్తుంటే.... టీ కాంగ్రెస్ లోని కీలక నేతలు పెద్దగా స్పందించని పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీ వెంకట్ రెడ్డి స్పందిస్తూ... రేవంత్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడారో తెలియదని...అమెరికా నుంచి వచ్చాక వివరాలు తెలుసుకుంటానని చెబుతూనే.... ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ నినాదమని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ను విమర్శిస్తూనే.... రేవంత్ రెడ్డి కంటే తానే సీనియర్ అని, స్టార్ క్యాంపెయినర్ గా చెబుతున్నానంటూ మాట్లాడారు. ఈ వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ... రేవంత్ రెడ్డికి మద్దతుగా గట్టిగా తిప్పికొట్టని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
మరికొందరు నేతలు రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఉచిత విద్యుత్ తీసివేయాలంటూ రేవంత్ రెడ్డి మాట్లాడలేదని... బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకునేందుకు ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక సీతక్కను సీఎంగా చేస్తామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా పర్యటను ముగించుకొని రేవంత్ రెడ్డి…. రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై మీడియా సమావేశం పెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.