Kejriwal - KCR: ‘ఆర్డినెన్స్‌’పై ఆగని పోరాటం.. రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం, కేసీఆర్‌తో భేటీ-delhi cm arvind kejriwal will meet cm kcr on saturday in hyderabad
Telugu News  /  Telangana  /  Delhi Cm Arvind Kejriwal Will Meet Cm Kcr On Saturday In Hyderabad
కేజ్రీవాల్ - కేసీఆర్ (ఫైల్ ఫొటో)
కేజ్రీవాల్ - కేసీఆర్ (ఫైల్ ఫొటో) (facebook)

Kejriwal - KCR: ‘ఆర్డినెన్స్‌’పై ఆగని పోరాటం.. రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం, కేసీఆర్‌తో భేటీ

26 May 2023, 17:09 ISTMaheshwaram Mahendra Chary
26 May 2023, 17:09 IST

Delhi Services Ordinance Row Updates: శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. ఢిల్లీకి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ పై చర్చించనున్నారు.

Delhi Services Ordinance Row: ఇటీవలే ఢిల్లీకి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పోరాడుతున్నారు. ఓవైపు పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే... మరోవైపు విపక్షాల మద్దతును కూడగడుతున్నారు.ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో భేటీ అయిన ఆయన.... శనివారం తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఆర్డినెన్స్ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కోరనున్నారు.

ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఆప్ గట్టిగా పోరాడుతోంది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆయా పార్టీల మద్దతు కూడగడుతున్నారు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నేతలతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే కేసీఆర్ తో కూడా చర్చలు జరిపి మద్దతు కోరనున్నారు.

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లు, నియామకాలపై నియంత్రణ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పును ఇచ్చింది. దీంతో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ సంబరాలు చేసుకుంది. కేంద్రంతో యుద్ధంలో పెద్ద విజయం సాధించామని చెప్పింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా, ఆ తీర్పు అమలు కాకుండా అడ్డుకునేందుకు ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆ ఆర్డినెన్స్ ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు మళ్లీ అధికారాలు వెళతాయని తెలిపారు. ఈ మేరకు ఆ ఆర్డినెన్స్ వస్తే రాజ్యసభలో అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీల అధినేతలను కలుస్తున్నారు.

అధికారుల బదిలీలు, నియామకాల నియంత్రణ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో కాకుండా తమకే ఉండాలని కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారుల సర్వీస్ నియంత్రణ అధికారం ఢిల్లీ ప్రభుత్వానికే ఉండాలంటూ సుప్రీం కోర్టు తీర్పుచెప్పింది. దీనికి బ్రేక్ లు వేసేలా లెఫ్టినెంట్ గవర్నర్‌కే మళ్లీ అధికారాలు దక్కేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందిస్తోంది. ఈ ఆర్డినెన్స్‌పై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆమ్ఆద్మీ పార్టీ.

సంబంధిత కథనం