Revanth Reddy :కాంగ్రెస్ దీక్షను నీరుగార్చాలనే కుట్ర, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని మళ్లీ రుజువైంది- రేవంత్ రెడ్డి
11 July 2023, 21:43 IST
- Revanth Reddy : రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టే సత్యాగ్రహ దీక్షను నీరుగార్చాలనే బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని మరోసారి నిరూపితమైందన్నారు.
రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతూ బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎదురుదాడిపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని మరోసారి నిరూపితమైందన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా 'సత్యాగ్రహ దీక్ష' పిలుపును నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందన్నారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అని ఆరోపించారు. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
రేవంత్ వ్యాఖ్యలు వక్రీకరించారు
రైతులకు ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని తెలిపారు. మంత్రులు ఊర కుక్కల్లా మాట్లాడుతున్నారని పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలులో అవినీతిపై రేవంత్ రెడ్డి మాట్లాడితే దానిని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్‌కు భయంపట్టుకుందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని తెలిపారు. మోదీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
బీఆర్ఎస్ ఆందోళనలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉచిత విద్యుత్ మూడు గంటలు చాలన్న రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మరోసారి రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.