Viral Fever : కంపు కొడుతున్న పల్లెలు.. పట్టించుకోని అధికారులు.. మంచానపడుతున్న ప్రజలు
15 September 2024, 18:00 IST
- Viral Fever : పరిశుభ్రంగా ఉండాల్సిన పల్లెలు కంపు కొడుతున్నాయి. వర్షాలతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపిస్తున్నాయి. జ్వరాలను అదుపు చేసేందుకు వైద్యశాఖ శిబిరాలు నిర్వహిస్తుంటే వ్యాధులకు కారణమైన అపరిశుభ్రాన్ని పారద్రోలడంపై సంబంధింత శాఖలు దృష్టిసారించడం లేదు.
కంపు కొడుతున్న పల్లెలు
ఆదిలాబాద్ జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత శాఖల ఉద్యోగులతో.. సమన్వయ సమావేశం నిర్వహించి పల్లెల శుభ్రతపై దిశానిర్దేశం చేశారు. కానీ ఆయా శాఖలు మాత్రం పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. మరోపక్క పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పల్లెలు నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి ఉందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.
జిల్లాలో జ్వరాల తీవ్రత పెరిగిపోతోంది. జ్వర బాధితులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులన్ని రద్దీగా మారాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ జ్వరాలతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తున్నాయి. ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ పలు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి అదుపు చేసే చర్యలు చేపట్టింది. అనేక పల్లెలు జ్వర బాధితులతో మంచానపడ్డాయి. తాజాగా.. ఖానాపూర్ మండలంలో ఇంటికొకరు చొప్పున జ్వరంతో మంచం పట్టగా.. వైద్యాధికారులు స్పందించి అక్కడ శిబిరం ఏర్పాటుచేసి చికిత్స అందించారు. ఈ జ్వరాలన్నింటికీ పారిశుధ్య లోపమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పల్లెల్లో నిధుల కొరత కారణంగా రెగ్యూలర్ గా చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోందని తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసినప్పటికి పారిశుధ్య కార్మికుల వేతనాలకే సరిపోయాయని తెలుస్తోంది.
దోమల స్వైర విహారం..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1512 పంచాయతీలు ఉండగా.. ఆదిలాబాద్లో 468, మంచిర్యాలలో 311, నిర్మల్ జిల్లాలో 396, కుమురంభీం ఆసిఫాబాద్ లో 335 పంచాయతీలున్నాయి. వర్షాల కారణంగా పల్లెలన్ని పచ్చదనం సంతరించుకుంటున్నా.. స్వచ్ఛదనం లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పల్లెల్లో ఇండ్ల చుట్టూ మురికినీరు నిల్వ ఉండటం.. ఏపుగా పిచ్చిమొక్కలు పెరగడం.. రోడ్ల పక్కనే గడ్డి మొలవడం.. ఖాళీ స్థలాలు చెత్తచెదారంతో నిండిపోవడం వంటి కారణాలతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. మురికి కాల్వలు, అపరిశుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం, దోమల మందు ఫాగింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉండగా.. నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి దోమల నివారణకు ఫాగింగ్ చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులు చిరుద్యోగులు కావడం.. సామగ్రి కొనుగోలుకు రూ.లక్షల్లో ఖర్చు కావడం వంటి సమస్యల కారణంగా సొంతంగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమస్య మీద దృష్టిసారించాల్సిన ప్రత్యేక అధికారులు మనకెందుకులే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోకపోవడం కారణంగా.. పల్లెల్లో దుర్గంధంతో జ్వరాలు ప్రబలడానికి కారణమవుతోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అపరిశుభ్రత పట్ల శ్రద్ద వహించాలని ప్రజలు కోరుతున్నారు.
(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)