Adilabad Tourism : కట్టిపడేసే జలపాతాల సోయగాలు..! ఆదిలాబాద్ అడవి అందాలను చూసొద్దామా
పచ్చని ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అందులోనూ వానకాలం వస్తే జిల్లాలోని జలపాతాలు పొంగిపోర్లుతుంటాయి. ఓవైపు అరణ్యం, మరోవైపు జలసవ్వడులు.. ఇలాంటి దృశ్యాలను ఒక్కమాటలో వర్ణించలేం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జిల్లావ్యాప్తంగా ఉన్న జలపాతాలకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఉత్తర సహ్యద్రి కొండల మధ్యలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్.. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. వాగులు, వంకలు, డట్టమైనా అడవులు, కావ్వాల్ అభయ్యారణ్యం, బాసర దేవాలయం, సింగరేణి బొగ్గు గనులు ఇలా ఎన్నో ప్రత్యేకలకు ఆదిలాబాద్ జిల్లా కేరాఫ్ గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పలు జలపాతాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా పడుతుండడంతో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు.
సాధారణ రోజుల్లో కంటే వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ అనుభూతని ఒక్కమాటలో చెప్పలేం. ఇలాంటి సమయంలోనే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. పచ్చని ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. జిల్లాలో అనేక జలపాతాలు చూపర్లను ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి.
ఇందులో కొన్ని కేవలం వర్షాకాలం వరదలతో 2 నుంచి 3 వారాలపాటే ఉండేవి కొన్ని అయితే మరికొన్ని ఏడాది పొడువునా జాలు వారే ఫాల్స్ ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి ప్రాంతమంతా పచ్చదనం పర్చుకుంటుంది. ఇలాంటి అడవిలో ఉండే ఎత్తైన కొండలపై నుంచి జాలు వారే జల పాతాలను వీక్షించేందుకు పర్యాటకులు అనేకమంది వస్తుంటారు.
కుంటాల జలపాతము:
కుంటాల జలపాతం నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్ళేటప్పుడు నేరేడి గొండ గ్రామము నుండి కుడివైపుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఆదిలాబాద్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జల పాతం వద్ద కడెం నది సెలయేళ్ళు 45 మీటర్ల (147 అడుగుల ఎత్తు ) ఎత్తునుండి కిందికి ప్రవహించి అరణ్యంలోకి కలుస్తాయి.
రాష్ట్రంలోనే ఇది అతి ఎత్తైన జలపాతం. ఈ అద్భుతమైన జలపాతం విస్తృతంగా ప్రవహించేటపుడు జలదారలు కన్నుల పండుగా చేస్తాయి. శీతాకాలంలో ఈ జలపాతంను చూసి ఆనందం పొందటానికి అనువైన సమయం. సోమేశ్వర స్వామి అని పిలువబడే శివలింగం ఈ జలపాతం దగ్గరలో ఉంది. మహా శివరాత్రి పర్వదినం ఇక్కడ అనేక మంది భక్తులు సందర్శించి శివ దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి ఏడాది పొడువునా పర్యాటకులు వస్తూనే వుంటారు.
ప్రకృతి ఒడిలో పొచ్చెర జలపాతం:
పొచ్చెర జలపాతానికి మంచి పిక్నిక్ స్పాట్ గా పేరుంది. ఇక్కడ అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ గా ఉంటాయి. నేషనల్ హైవే హైదరాబాద్ నుండి నాగపూర్ వెళ్ళేటప్పుడు నేరేడి గొండ గ్రామము నుండి ఎడమ వైపు కు బోథ్ మార్గంలో 4కిలోమీటర్లు వెళ్తే ఎక్స్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి మరో 4 కి.మీ. దూరం వెళ్తే జలపాతానికి దారి కనిపిస్తుంది. ఇక్కడ పైనుండి జాలు వారే నీటిని పర్యాటకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
కనువిందుచేసే గాయత్రి జలపాతం:
నేరడిగొండ మండలంలోని తర్ణం గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గాయత్రీ జలపాతం ఉంటుంది. ప్రకృతి లో రెండు భారీ కొండల మధ్య దాదాపు 350 అడుగుల పైనుంచి జలపాతం ప్రవహిస్తుంది. జలపాతం కింది భాగంలో అప్పుడప్పులు ఇంద్రధనస్సు ఆవిష్కృతమై చూపారులను అబ్బురపరుస్తుంది. సూర్యుడి కాంతి ఎక్కువగా ఉన్నంతసేపు ఈ అద్భుతం అలాగే ఉంటుంది.
వారెవ్వా.. గుత్పల జలపాతం..
నేరడిగొండ మండలంలోని రోల్ మామడ నేషనల్ హైవే నుంచి ఒకకిలోమీటర్ లోపలికి వెళ్తే గుత్పల జలపాతం కనిపిస్తుంది.70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ధారలను చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు. అయితే జలపాతానికి వెళ్లేందుకు రోడ్డున్నా సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో జలపాతం ఉన్న విషయం కూడా తెలియడం లేదు.
గుండాల జలపాతం :
గుండాల జలపాతం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో ఉన్నపటికీ మంచిర్యాల జిల్లా వాసులకు దండేపల్లి నుంచి వెళ్లేందుకు రహదారి మార్గం ఉంది. దండేపెల్లి గ్రామం నుంచి దాదాపు 15కిలో మీటర్లు వెళ్తే ఈ గుండాల జలపాతం కనిపించదు. వెళ్లే దారిలో ప్రకృతితో కూడిన ఎన్నో అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వెళ్లే మార్గం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ జలపాతం ప్రాంతానికి వెళ్ళే సరికి ప్రయాణ కష్టాలు అన్ని మర్చిపోతారు.
కోరిటికల్ జలపాతం:
నేరడిగొండ మండల కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే సమీపంలోనే కొరటికల్ జలపాతం దర్శనమిస్తుంది. తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ ఆ ప్రవాహ హోరు ప్రయాణికుల్ని ఆగి చూసేలా చేస్తోంది. అనేకమంది పర్యాటకులు ఈ జలపాతం రోడ్డుకు పక్కనే కనిపిస్తుండడం తో ప్రయాణం ఆపి కాసేపు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు.
వాస్తవాపూర్ జలపాతం :
నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. చుట్టూ పచ్చని తోరణాలతో నెలకొని ఉన్న జలపాతానికి తెలంగాణ, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు.
జలపాతంలో నీటి ప్రవాహానికి తడుస్తూ కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు . ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.. స్థానిక అటవీ శాఖ వారు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.