Adilabad : వరద నష్టంపై స్పష్టమైన నివేదిక ఇవ్వండి.. ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి భవేష్ మిశ్రా
Adilabad : భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జిలు, పంటలకు జరిగిన నష్టంపై అంచనాలను సిద్ధం చేయాలని.. జిల్లా ప్రత్యేక అధికారి భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో.. ఆయా జిల్లాల కలెక్టర్‌లతో వరద ప్రాంతాల్లో పర్యటించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, రహదారులు, నివాస గృహాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని.. ఆదిలాబాద్ ప్రత్యేక అధికారి భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన నష్టంపై అధికారులతో సమీక్షించారు. భారీ వరదలతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
పంటలు నష్టపోయిన రైతులకు, నివాస గృహాలు పాక్షికంగా, పూర్తిగా కూలిపోయిన బాధితులకు పూర్తి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని భవేష్ మిశ్రా సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి రహదారులు, బ్రిడ్జిలకు జరిగిన నష్టాన్ని పక్కాగా నమోదు చేయాలన్నారు. పాఠశాలలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిత శాఖల అధికారులు వెళ్లి పరిశీలించాలని.. జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాఖల వారిగా జరిగిన నష్టాన్ని అధికారులు వివరించారు. కుబీర్, బైంసా, మామడ, కడెం, లక్ష్మణ చందా మండలాలలో అధిక నష్టం జరిగిందని వివరించారు. జిల్లాలోని గడ్డనవాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి భారీ వరద వచ్చిందని.. పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి ప్రాణ నష్టం జరగకుండా చూశామని అధికారులు వివరించారు. భారీ వర్షాలతో 966 హెక్టార్లలో పాక్షికంగా వివిధ పంటలకు నష్టం జరిగిందని అధికారులు వివరించారు.
పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 75 రహదారులు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన 30 రహదారులకు వరదతో నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్షం నమోదైన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో వర్షపు నీరు చేరడంతో.. రోగులను సమీప ఆసుపత్రులకు తరలించామన్నారు. 117 పాఠశాలల్లో స్లాబ్ లీకేజీ, పహరి గోడలు కూలిపోయాయని అధికారులు వివరించారు.
నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో భారీ వర్షాలతో దెబ్బతిన్న సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, పురాతన భవవనాలకు జరిగిన నష్టంపై ప్రత్యేక అధికారికి వివరించారు. విద్యుత్ శాఖలో 83 పోల్స్‌కు నష్టం జరిగితే.. ఇప్పటివరకు 63 పోల్స్‌ను సరిచేసినట్టు అధికారులు వివరించారు. అంతకుముందు భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు, నివాస గృహాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్ పరిశీలించారు.
(రిపోర్టింగ్- ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)