Secunderabad to Goa Train : గోవా లవర్స్‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- గోవా ట్రైన్ ప్రారంభం.. టికెట్ ధర ఎంతో తెలుసా?
06 October 2024, 13:47 IST
- Secunderabad to Goa Train : చాలామందికి గోవా వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ.. బడ్జెట్, ప్రయాణ వివరాలు తెలియక డ్రాప్ అవుతుంటారు. అలాంటి వారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవా వెళ్లే ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాన్ని ఇవాళ ప్రారంభించారు.
సికింద్రాబాద్- గోవా ట్రైన్
చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్- గోవా ట్రైన్ ఎట్టకేలకు ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్‌ను ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్- వాస్కోడగామా (గోవా) మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ రైలు ప్రారంభంతో తెలుగు ప్రజలకు గోవా ప్రయాణం సులభంగా మారుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బుధ, శుక్ర వారాల్లో..
సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు.. వారంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుందని అధికారులు చెప్పారు.
శని, ఆదివారాల్లో..
వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్‌కు కూడా వారంలో రెండు రోజులు అందుబాటులో ఉంటుంది. గురు, శనివారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు.
19 స్టాఫ్‌లు..
ఈ రైలుకు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్‌రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయి. సికింద్రాబాద్- గోవా ట్రైన్‌లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచే టికెట్ల బుకింగ్‌కు అనుమతించారు.
టికెట్ ధరలు (రిజర్వేషన్ కోసం)..
స్లీపర్ క్లాస్- రూ. 440
3ఈ - రూ. 1100
థర్డ్ ఏసీ- రూ. 1185
సెకండ్ ఏసీ- రూ. 1700
ఫస్ట్ ఏసీ - రూ. 2860