Munugodu Bypoll Result: మునుగోడులో టీఆర్ఎస్ విజయఢంకా - 10 వేలు దాటిన మెజార్టీ
06 November 2022, 20:49 IST
- TRS Win in Munugodu: మునుగోడులో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రతిష్టాత్మకమైన పోరులో గెలిచి నిలిచింది. మరోవైపు పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
టీఆర్ఎస్ విజయం
Munugodu Bypoll Result 2022: మునుగోడు తీర్పు వచ్చేసింది. హోరాహోరీగా సాగిన పోరులో అధికార టీఆర్ఎస్... గులాబీ జెండా ఎగిరింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్ ఇచ్చింది. కీలకమైన ఉపఎన్నికలో గెలిచి.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నుంచి... ఢీ అంటే ఢీ అన్నట్లు సాగిన పోరులో... 10,309 ఓట్ల మెజార్టీతో గెలిచి నిలిచింది. ఈ విజయం టీఆర్ఎస్ పార్టీకి కొత్త జోష్ ను ఇచ్చినట్లు అయింది.
ఆధిక్యత ఇలా...
కౌంటింగ్ ప్రక్రియలో దాదాపు మెజార్టీ రౌండ్లలో టీఆర్ఎస్ లీడ్ సాధించింది. రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక కీలకమైన చండూరులోనూ టీఆర్ఎస్ లీడ్ సంపాదించటం ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది. చౌటుప్పల్, చండూరుపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి... గట్టి షాకే తగిలినట్లు అయింది. ఆశించిన మేర చౌటుప్పల్ లో మెజార్టీ రాకపోవటంతోనే వెనకబడినట్లు ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. రెండు, మూడు రౌండ్లు మినహా... మిగితా అన్ని రౌండ్లలోనూ కారు దూసుకెళ్లింది. చివరి 15వ రౌండ్ ముగిసే సరికి 10,309 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి 97,006 ఓట్లు రాగా.. బీజేపీకి 86,697 ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 23,601 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
ఫలితంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డి విజయం సాధించినట్లు అయింది. 2104 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ ఉపఎన్నికలో గెలవటంతో… రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాదించారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విక్టరీ కొట్టి… తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
మరోవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంపై టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుతున్నాయి. తెలంగాణ భవన్ లో వేడుకలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగానూ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎప్పుటికి కేసీఆర్ తోనే అంటూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ పతనం మునుగోడు నుంచే మొదలైందన్నారు. ఫలితాలపై మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ప్రజలు పట్టంకట్టారని మంత్రి కేటీఆర్ చెప్పారు. పార్టీ గెలుపు పని చేసిన కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీ అహంకారానికి మునుగోడు తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.