Allu Arjun Arrest : ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా..? స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు - సీఎం రేవంత్ రెడ్డి
13 December 2024, 20:11 IST
- Arrest of Allu Arjun : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆజ్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఫిల్మ్ స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని చెప్పారు. జనం ప్రాణం పోయింది.. అయినా కేసు పెట్టొద్దా అంటూ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హీరో అల్లు అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్ట్ ను పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే ఈ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆజ్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది.. దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని చెప్పారు.
స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు - సీఎం రేవంత్
“అల్లు అర్జున్ అరెస్టు చేసామంటున్నారు. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి హీరోలు ఎందుకు అరెస్ట్ అయ్యారు..? సంథ్య థియేటర్ ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయింది. పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. జనం ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా..?” అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదు. అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11గా పోలీసులు పెట్టారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు..?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత. అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు. హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసు. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడు” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
సినిమాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి… సినిమా కోసం పైసలు పెడుతారు.. పైసలు సంపాదిస్తారని అని అన్నారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదన్నారు. “నా ఫేవరెట్ హీరో కృష్ణ.. ఆయన ఇప్పుడు లేరు. ఇప్పుడు నేనే స్టార్ను. నాకూ ఫాన్స్ ఉంటారు” అంటూ కామెంట్స్ చేశారు.