Allu Arjun Lawyer: అల్లు అర్జున్‌కు బెయిల్ ఇప్పించిన ఈ లాయర్ ఎవరు, ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Allu Arjun Lawyer: అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు అన్న ఆసక్తి ఇప్పుడు అతని అభిమానుల్లో నెలకొంది. లాయర్ తోపాటు వైఎస్సార్సీపీ ఎంపీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్.. ఇలా నిరంజన్ రెడ్డిది చాలా భిన్నమైన నేపథ్యమే ఉంది.
Allu Arjun Lawyer: అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్ వార్తలతోపాటు శుక్రవారం (డిసెంబర్ 13) మరో ఆసక్తికరమైన వార్త కూడా తెరపైకి వచ్చింది. ఇంతకీ అతనికి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, వసూలు చేసే ఫీజు ఎంత అన్న వివరాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. అల్లు అర్జున్ తరఫున తెలంగాణ హైకోర్టులో వాదించిన ఆ లాయర్ పేరు ఎస్. నిరంజన్ రెడ్డి.
ఎవరీ నిరంజన్ రెడ్డి?
నిరంజన్ రెడ్డిది చాలా ప్రత్యేకమైన నేపథ్యమని చెప్పొచ్చు. ఆయన లాయరే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. అంతేకాదు గతంలో తెలుగులో నాలుగు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అందులో చిరంజీవి నటించిన ఆచార్య కూడా ఉండటం విశేషం. ఈ నిరంజన్ రెడ్డిది తెలంగాణలోని నిర్మల్ ప్రాంతం. ఆయన తండ్రి విద్యా సాగర్ రెడ్డి కూడా పేరు మోసిన లాయరే.
నిజామాబాద్ తోపాటు హైదరాబాద్ లోనూ చదువుకున్నారు. 1992లో లా చదువు పూర్తి చేశారు. పుణెలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లో నిరంజన్ రెడ్డి లా చదివారు. ఓవైపు లాయర్ గా చేస్తూనే.. తెలుగు సినిమాల్లోనూ ప్రొడ్యూసర్ గా ఉండటం విశేసం. 2011లో వచ్చిన గగనం మూవీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, ఆచార్యలాంటి సినిమాలను నిర్మించారు. వీటిలో గగనం, క్షణం, ఘాజీ హిట్టయినా.. వైల్డ్ డాగ్, ఆచార్య సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. 2022లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
నిరంజన్ రెడ్డి వసూలు చేసే ఫీజు ఎంతంటే?
అయితే ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాయర్ గా వసూలు చేసే ఫీజు గురించి కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించడంతో ఈ సెలబ్రిటీ లాయర్ పేరు మార్మోగిపోతోంది. ఎంతో సీనియర్ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి గంటకు రూ.5 లక్షలు వసూలు చేస్తారని వార్తలు వస్తున్నాయి.
శుక్రవారం (డిసెంబర్ 13) బన్నీకి బెయిల్ విషయంలోనూ ఆయన పాత్ర ఎంతో ఉంది. నిజానికి అంతకుముందే నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల కస్టడీ విధించింది. హైకోర్టులోనూ వాదనలు చాలా వాడీవేడిగా సాగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేలా నిరంజన్ రెడ్డి తన అనుభవాన్నంతా ఉపయోగించి వాదించారు.
ఆయన వాదనలు ఫలించి.. బన్నీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ మధ్యంతర బెయిల్ నాలుగు వారాల పాటు ఉండనుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ దేశం విడిచి వెళ్లొద్దన్న షరతు విధించారు. మొత్తానికి బన్నీ బెయిల్ ద్వారా ఈ లాయర్ కమ్ పొలిటీషియన్ కమ్ ప్రొడ్యూసర్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది.