Nizamabad Police : భిక్షాటన కోసం బాలుడి కిడ్నాప్.. 36 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు?
21 October 2024, 14:15 IST
- Nizamabad Police : భిక్షాటన కోసం ఏడాది వయసున్న బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును నిజామాబాద్ జిల్లా పోలీసులు 36 గంటల్లోనే ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల పనితీరుపై నిజామాబాద్ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో రాజు, అతని భార్య లక్ష్మి నివాసం ఉంటున్నారు. అయితే.. రాజు భార్యకు ఆరోగ్యం బాలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం సమయంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి తీసుకొచ్చారు. సాయంత్రం పూట ఓపీ లేకపోవడంతో.. శనివారం ఉదయం చూపిద్దామని అక్కడే ఉన్నారు. రాత్రి ఆసుపత్రి ఆవరణలోనే తన కూతురు, కుమారుడు మణికంఠతో కలిసి నిద్రించారు.
వీరు అసుపత్రి ఆవరణలో నిద్రపోతున్న సమయంలో.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన అంజుమ్ బేగం, ఓ బాలిక (10), దుర్గా ప్రభురావుభా మోహతేలు.. అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో బాలుడిని ఎత్తుకెళ్లారు. ఉదయం లేచిన తల్లిదండ్రులకు కుమారుడు మణికంఠ కనిపించలేదు. దీంతో కంగారుపడిన రాజు, లక్ష్మీ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిజామాబాద్ జనరల్ ప్రభుత్వ హాస్పిటల్, బస్టాండు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే.. నిందితులు బాలుడిని తీసుకొని నాందేడ్ వెళ్లాలని రైల్వే స్టేషన్ చేరుకున్నారు. రైలు లేకపోవడంతో మళ్లీ నిజామాబాద్ నగరంలో తిరుగుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వీరి వద్ద బాలుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
సమాచారం రాగానే పోలీసులు రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్లారు. అనుమానాస్పదంగా కనిపించిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. బాలుడిని మహారాష్ట్ర తీసుకెళ్లి భిక్షాటన చేయించడానికి అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. వారినుంచి బాలుడిని తీసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు అప్పగించారు.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. ఈ కిడ్నాప్ కేసును ఛేదించడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. 36 గంటల్లోనే కేసు ఛేదించడంతో.. పోలీసులను నిజామాబాద్ ప్రజలు ప్రశంసిస్తున్నారు.