Nizamabad Marriage: పెళ్లి విందులో రగడ, పోలీస్ స్టేషన్‌కు చేరిన మటన్ పంచాయితీ, నిజామాబాద్‌లో ఘటన..-mutton panchayat incident in nizamabad dispute went to the police station during the wedding feast ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad Marriage: పెళ్లి విందులో రగడ, పోలీస్ స్టేషన్‌కు చేరిన మటన్ పంచాయితీ, నిజామాబాద్‌లో ఘటన..

Nizamabad Marriage: పెళ్లి విందులో రగడ, పోలీస్ స్టేషన్‌కు చేరిన మటన్ పంచాయితీ, నిజామాబాద్‌లో ఘటన..

Bolleddu Sarath Chandra HT Telugu
Aug 29, 2024 09:19 AM IST

Nizamabad Marriage: నిజామాబాద్‌ నవీపేటలో మటన్‌ ముక్కల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్ళి విందులో మటన్ వడ్డించలేదంటూ మొదలైన రగడ కాస్త ఇరు వర్గాలు కొట్లాటకు దిగే వరకు వెళ్లింది. వధువరుల బంధువులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ గొడవ చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది.

నిజామాబాద్‌  పెళ్లి వేడుకలో మటన్ కోసం గొడవ
నిజామాబాద్‌ పెళ్లి వేడుకలో మటన్ కోసం గొడవ

Nizamabad Marriage: పెళ్లి విందులో వధువరుల తరపు బంధువులు మటన్ ముక్కల కోసం కొట్లాటకు దిగారు. విందులో వడ్డించిన భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ మొదలైన ఘర్షణ కాస్త చినికిచినికి గాలివానగా మారింది. పరస్పర దాడులతో ఉద్రిక్తంగా మారింది. వరుడి తరపు బంధువులు, వధువు తరపు వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో బుధవారం జరిగింది.

నిజామాబాద్‌ నవీపేట ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో బుధవారం వివాహం జరిగింది. వివాహం అనంతరం జరిగిన విందులో వరుడి తరపున పెళ్లిక హాజరైన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు.

తమకు తక్కువ మటన్‌ ముక్కలు వేశారంటూ వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వడ్డించే వారిని దూషించడంతో గొడవ మొదలైంది. వధువు తరపు బంధువులు కల్పించుకుని సర్ది చెబుతున్న క్రమంలో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది.

ఆవేశంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. చేతికి అందిన వస్తువులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనతో పెళ్లి విందులో ఉన్న వారు తలోదిక్కుకు పరుగులు తీశారు. వరుడి తరపు వారిపై దాడి చేశారంటూ ఓ వర్గం, తమపై దాడి చేశారంటూ వధువు బంధువులు వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

దీంతో ఫంక్షన్‌ హాలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివాహ వేడుకల్లో గొడవ జరుగుతున్న సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పారు. ఘర్షణకు కారణమైన వారిలో రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు.

ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. గొడవలో గాయపడిన సత్యనారాయణ, సాయిబాబా సహా ఎనిమిది మందిని నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పెళ్లి రోజే వధువరుల తరపు బంధువులు గొడవ పడి కేసుల్లో ఇరుక్కోవడంతో అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మటన్ ముక్కల కోసం తలలు పగులగొట్టుకున్నారని, మద్యం మత్తులో కొందరు యువకులు చేసిన నిర్వాకంతో పెళ్లింట చిక్కులు వచ్చాయని చెబుతున్నారు.

Whats_app_banner