Janwada Farm House Row : అజ్ఞాతంలోకి రాజ్ పాకాల.. జన్వాడ పార్టీ కేసులో ట్విస్ట్!
28 October 2024, 10:32 IST
- Janwada Farm House Row : జన్వాడ పార్టీ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రాజ్ పాకాల ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని చెబుతున్న విజయ్ మద్దూరి ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఇష్యూపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
అజ్ఞాతంలో రాజ్ పాకాల
హైదరాబాద్ జన్వాడ పార్టీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీని అరెంజ్ చేసిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ పాకాల, విజయ్ మద్దూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ విజయ్ మద్దూరిని మరోసారి విచారించే ఛాన్స్ ఉంది. అయితే.. రాజ్ పాకాల డ్రగ్స్ తీసుకోమంటేనే తీసుకున్నానని.. విజయ్ మద్దూరి స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు పోలీసుల వెల్లడించారు.
ఇక్కడే విజయ్ మద్దూరి ట్విస్ట్ ఇచ్చారు. పోలీసుల స్టేట్‌మెంట్‌ను విజయ్ మద్దూరి ఖండించారు. తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. 'నేను చెప్పని మాటలు నేను చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో రాసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులతో కలిసి రాజ్ పాకాల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్తే బద్నాం చేయాలని కుట్రపూరితంగా చేస్తున్నారు' అని విజయ్ మద్దూరి స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. 'అది ఫామ్‌హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు. ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లోకి వెళ్లినప్పుడు అందరిని పిలవలేక పోయాడు. అందుకు దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. అది ఫ్యామిలీ ఫంక్షన్. సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తూ.. కొంత మంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. మా అత్తమ్మ(70) కూడా అక్కడే ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఒక కుటుంబం అంతా కలిసి అక్కడ ఉంటే రేవ్ పార్టీ అని ఎలా అంటారు' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబ సభ్యుల మీద కొన్ని కేసులు బనాయిస్తున్నారు. మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, గొంతునొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే సావుకు తెగించి వచ్చిన వాళ్లం.. కేసులకు, మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకు భయపడము' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
'పొద్దున నాలుగు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెడుతున్నామని అన్నారు. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయింది. ఎన్టీపీఎస్‌లో 25, 27, 29 సెక్షన్లు పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏంటి.. సప్లయర్, కన్సెప్షన్, కో హోస్ట్. అసలు సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలి లేదా ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే, ఆ కేసు ఎలా పెడతారు? అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే.. 13 మందికి నెగటివ్ వచ్చింది. ఒకరికి పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసుకోకుండా ఎలా కేసు పెడతారు.. అక్కడ కనీసం మిల్లీగ్రామ్ కూడా దొరకకుండా ఏ రకంగా బద్నాం చేస్తారు' అని కేటీఆర్ ప్రశ్నించారు.