Janwada Farm House Rave Party : జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసు, పరారీలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల!
Janwada Farm House Rave Party : హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు నిర్థారించారు. రేవ్ పార్టీ వ్యవహారంలో ఫామ్ హౌస్ యజమాని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందినది తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు పోలీసులు అనుమానించి, పార్టీలో పాల్గొన్న 21 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఆయన కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్స్ పరీక్షలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 14 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పరారీలో రాజ్ పాకాల
జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై విచారణ జరుగుతుందని ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఈ కేసులో ఏ1గా ఫామ్‌హౌస్ సూపర్‌వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి రేవ్ పార్టీ నిర్వహించడం, కర్ణాటక మద్యంతో పాటు భారీగా విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫామ్ హౌస్ నుంచి ఏడు లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేశామన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాయదుర్గంలోని రాజ్ పాకాల ఉంటున్న విల్లాకు తాళం వేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల తమ అదుపులో లేరని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ తెలిపారు.
కేటీఆర్ ఇప్పుడేం చెబుతారో - బండి సంజయ్ విమర్శలు
జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు నటిస్తోంది కానీ నిజానికి బీఆర్ఎస్ పెద్దలను కాపాడుతోందని ఆరోపించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో దాడి మంచుకొండ కొన మాత్రమే అన్నారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై కేటీఆర్ ఇప్పుడేం చెబుతారో అని బండి సంజయ్ ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో? అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలన్నారు. సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. రేవ్ పార్టీలో ఉన్న బడా నేతలతో సహా అందరినీ అరెస్టు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం ఊహాజనిత ప్రకటనలు చేస్తూ ఈ కేసును పలుచన చేయకూడదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకరి ప్రయోజనాలను మరొకరు కాపాడుకుంటూ గేమ్ ఆడుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న హైప్రొఫైల్ వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోండి. వారి టవర్ స్థానాలను భద్రపరచాలి. సీసీటీవీ ఫుటేజీ ప్రతి భాగాన్ని విడుదల చేయండి. ఎటువంటి ఉదాసీనత లేకుండా, తప్పించుకునే మార్గాలు లేకుండా నిందితులను తక్షణ అరెస్టులు చేయాలని డిమాండ్ చేస్తున్నాను" - కేంద్ర మంత్రి బండి సంజయ్
సంబంధిత కథనం