High Court On Contract Employees : 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు హైకోర్టు షాక్, రెగ్యులరైజేషన్ చెల్లదని తీర్పు
19 November 2024, 17:05 IST
High Court On Contract Employees : కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదని, జీవో 16ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వం జీవో 16 ద్వారా 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.
8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు హైకోర్టు షాక్, రెగ్యులరైజేషన్ చెల్లదని తీర్పు
కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన జీవో 16న హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇకపై వారంతా తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 16 ప్రకారం దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఈ జీవోను తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ వ్యతిరేకింది. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, జీవో 16ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది.
జీవో 16 ను రద్దు చేస్తూ..కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. విద్య, వైద్య శాఖలలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ అయ్యారు. హైకోర్టు తీర్పుతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. హైకోర్టు తీర్పుతో తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
రెగ్యులరైజ్ చేసిన వారిని తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు చెబుతున్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే ఈ విషయంపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను హైకోర్టు రద్దు చేసిన పిటిషనర్లు చెప్పారు. గత ప్రభుత్వంలో డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని... దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జీవో 16ను రద్దు చేసింది.
95 మంది ఉద్యోగులను తొలగించిన ఏపీ సర్కార్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారికి ఏపీఎండీసీ షాక్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ సేవల కింద పనిచేస్తున్న 45 మందిని, 50 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోంచి తొలగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫార్సులతో ఏపీఎండీసీలో ఉద్యోగాలు పొందారని కూటమి నేతలు చెబుతున్నారు. వీరితో పాటుగా వివిధ శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులతో ఏపీఎండీసీలో అవసరం లేకపోయినా వందల సంఖ్యలో ఉద్యోగులను అక్రమంగా నియమించారనే విమర్శలు ఉన్నాయి.
సిఫార్సులతో నియమితులైన 95 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదేళ్ల పాటు జీతాలు చెల్లించడం వల్ల ఏపీఎండీసీపై అదనపు భారం పడిందని కూటమి సర్కార్ తెలిపింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి వివరాలపై ఆరా తీసి, వారికి చెక్ పెట్టింది. ఈ ఉద్యోగుల కాంట్రాక్టు ఈ ఏడాది జూన్ తో ముగిసింది. ఆ తర్వాతా మళ్లీ పొడిగించలేదు. తాజాగా మరో 95 మందిని తొలగించారు.