Lagacherla Farmers : 'రేవంత్ రెడ్డి... కావాలంటే మమ్మల్ని జైల్లో పెట్టు, రైతులను వదిలేయ్' - కేటీఆర్
లగచర్ల రైతులను సంగారెడ్డి జైల్లో కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో ఉన్నవాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉందన్నారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారని విమర్శించారు. ఫార్మా విలేజ్ పేరుతో కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగిందనే కేటీఆర్ చెప్పారు. లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్… లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారని చెప్పారు.
కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డియే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
“జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు ఇంకొక తమ్ముడు వనపర్తిలో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారు దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్‌లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడు. ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్‌లో రాజ్యంగేతర శక్తిగా మారాడు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “కొడంగల్‌లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారు. నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు. కానీ అరెస్ట్ చేసిన 70 మందిలో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లు గుర్తించి 21 మందిని మాత్రమే చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. కానీ దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారు వాళ్ల చేతగానితనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారు” అని కేటీఆర్ విమర్శించారు.
అరెస్ట్ అయిన 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలే అని కేటీఆర్ చెప్పారు. వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు వారిని చిత్ర హింసలు పెట్టారని, మూడు మూడు గంటలపాటు కొట్టారని అన్నారు. “మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారు. తీవ్రవాదులను పట్టుకొనేందుకు వెళ్లినట్లు డోర్లను తంతు పోలీసులు ఊర్లో భయానక వాతావారణ సృష్టించారు . రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే.. అధికారం శాశ్వతమని భావించకండి. నువ్వు చక్రవర్తివి కాదు. నీలాంటి చాలా మంది చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే మేము ఊరుకోం” అని కేటీఆర్ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డిపై ఇవ్వాళ కొడంగల్ మర్లవడ్డదన్నారు కేటీఆర్. రేపు తెలంగాణ మొత్తం మర్లవడుతదని హెచ్చరించారు. “కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం. కానీ రైతులను వదిలేయ్. నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతది. ఏ పేద ప్రజల ఓట్లతో గెలిచావో ఆ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీకు వాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. 21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుంది”అని కేటీఆర్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం