తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Graduate Mlc By Election : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు

Graduate Mlc By election : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు

27 May 2024, 18:26 IST

google News
    • Graduate Mlc By election : ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సుమారు 60 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సమాచారం. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు

Graduate Mlc By election : తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. అయితే సాయంత్రం 4 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఉపఎన్నికలో సుమారు 60 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు జూన్ 5న వెలువడనున్నాయి. 34 అసెంబ్లీ స్థానాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది.

పల్లా రాజీనామాతో

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల‌ రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది.

బ్యాలెట్ విధానంలో పోలింగ్

ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రాధాన్యత ఓటు పద్ధతి నిర్వహించడంతో బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్‌ రంగు పెన్నుతో అభ్యర్థులకు తమ ప్రాధాన్యతను టిక్‌ చేశారు. రాష్ట్రంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికలు జరగడంతో...ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు ఎడమచేయి మధ్యవేలుకి సిరా చుక్క వేశారు. ఉపఎన్నిక సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ కు 24 గంటల ముందే మద్యం షాపు బంద్ చేయించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు.

జూన్ 5 ఓట్ల లెక్కింపు

జూన్‌ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలమందికి పైగా అధికారుల, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలు, అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 5 బూత్‌లలో పోలింగ్‌ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికను బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. జాబితా ఎక్కువగా ఉండటంతో పెద్ద సైజు బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించారు. పోలింగ్ కోసం జంబో బ్యాలెట్‌ బాక్సులను వినియోగించారు.

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53 పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4 వరకూ క్యూలైన్లలో చాలా మంది ఓటర్లు ఉన్నారు. వారి ఓటింగ్ పూర్తయితే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను నల్లగొండ స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

తదుపరి వ్యాసం