Graduate Mlc Elections: నేడు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్, పోటీలో 52మంది అభ‌్యర్థులు-polling for mlc by election of graduates in telangana today 52 candidates in competition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Graduate Mlc Elections: నేడు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్, పోటీలో 52మంది అభ‌్యర్థులు

Graduate Mlc Elections: నేడు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్, పోటీలో 52మంది అభ‌్యర్థులు

Sarath chandra.B HT Telugu
May 27, 2024 06:31 AM IST

Graduate Mlc Elections: తెలంగాణలో నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక జరుగనునంది.

నేడు తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
నేడు తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Graduate Mlc Elections: తెలంగాణలో నేడు ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్‌ రెడ్డితో పాటు మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు నేడు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులు 2,88,189, మహిళలు 1,75,645 మంది ఉన్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే వరంగల్‌లో 1,73,413 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,08,349మంది, మహిళలు 65,063మంది ఉన్నారు. ఉమ్మడి నల్లగొండజిల్లాలో 1,66,448 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,06,574మంది, మహిళలు 59,874మంది ఉన్నారు.

ఖమ్మంలో 1,23,985 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 73,266మంది, మహిళలు 50,715మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 605 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్ జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలమందికి పైగా అధికారుల, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 5 బూత్‌లలో పోలింగ్‌ జరుగనుంది. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికను బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహిస్తారు. ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. జాబితా ఎక్కువగా ఉండటంతో పెద్ద సైజు బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించారు. పోలింగ్ కోసం జంబో బ్యాలెట్‌ బాక్సులను వినియోగిస్తున్నారు.

పోలింగ్‌ నిర్వహణ కోసం ఆదివారమే ఎన్నికల సామాగ్రితో సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు పంపించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటుచేశారు. పట్టణాలతో పాటు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పోలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

మూడు జిల్లాల్లో 283 పోలింగ్‌ కేంద్రాల్లో సగటున 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. మొదట 600 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించినా భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాల్లో రెండు కేంద్రాలను మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ ఉండదని స్పష్టం చేశారు.

జూన్‌ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేశారు. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని సూచించించారు.

ప్రాధాన్య క్రమంలో ఎంపిక..

ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రతి ఓటరు ప్రాధాన్య క్రమంలో అందరు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎంచుకున్న అభ్యర్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థుల్ని ఎన్నికల సంఘం ఇచ్చే ప్రత్యేక పెన్నుతో మాత్రమే మార్క్‌ చేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటును గుర్తించిన తర్వాతే మిగతా ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు లేకపోతే ఆ ఓటును చెల్లనిదిగా పరిగణిస్తారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం