తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt Lrs Scheme : 'క్రమబద్ధీకరణకు అవకాశం' - ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Govt LRS Scheme : 'క్రమబద్ధీకరణకు అవకాశం' - ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

26 February 2024, 21:01 IST

google News
    • Telangana Govt LRS Scheme 2020 Updates: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల(2020)పై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఫలితంగా 20 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం (https://lrs.telangana.gov.in/)

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం

Telangana Govt LRS Scheme Updates: ఎల్ఆర్ఎస్(Layout Regularisation Scheme-2020) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోపు మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప… ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం…. అనుమతులు లేని స్థలాల క్రమబద్ధీకరించుట కోసం ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్ ను తీసుకొచ్చింది. అయితే ఇందుకోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా… చాలా మంది ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు చేశారు. స్థలాలను బట్టి దరఖాస్తు రుసుంను కూడా విధించారు. ఈ స్కీమ్ కు సంబంధించి హైకోర్టులో పలు కేసులు దాఖలు అయ్యాయి. దీంతో ఈ ప్రక్రియలో ముందడుగు పడలేదు. ఈ ప్రక్రియ పూర్తి అయితే…. కార్పొరేషన్లతో పాటు పంచాయతీలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉండేది. అయితే కోర్టు కేసుల జాప్యంతో పాటు గత ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారంపై పెద్దగా దృష్టిపెట్టలేదన్న విమర్శలు కూడా వచ్చాయి.

2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో… ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. లక్షలాది మంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న క్రమంలో…. తాజా నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది.మార్చి 31 లోపు మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. గతంలో రూ.1000 చెల్లించి అప్లికేషన్లు చేసుకున్న వారికి క్రమబద్ధీకరణ చూసుకునే అవకాశం లభించనుంది. మొత్తంగా 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

సచివాలయంలో ఇవాళ రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు కూడా రానున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, మైన్స్ అండ్ జియాలజీ, టీఎస్ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆర్ధిక సంవత్సరాలవారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టీలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తదుపరి వ్యాసం