JPS Regularization: జేపీఎస్‌ల క్రమబద్ధీకరణపై కీలక ఆదేశాలు - ఆ స్కోర్ దాటిన వారికే నియామక ఉత్తర్వులు!
JPS Regularization in Telangana: JPSల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కీలక అంశాలను ప్రస్తావించింది.
JPS Regularization in Telangana: రాష్ట్రంలో పని చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్దేశించిన అంశాల్లో 70 శాతానికి పైగా స్కోరు సాధించిన జేపీఎస్ లకు నియామక ఉత్తర్వులను అందజేయాలని ప్రభుత్వం సూచించింది. అంతకంటే తక్కువ స్కోరు సాధించిన వారి పని తీరును మరో ఆరు నెలలు పరిశీలించాలని పేర్కొంది. ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు, ఇతర వివరాలను యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.
ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ జేపీఎస్ సర్వీసును క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీ రాజ్ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 2019లో ఉద్యోగాల్లో చేరారు. నాటి నుంచి రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చిరు ఉద్యోగులతోపాటు వివిధ శాఖల ఉద్యోగులకు ఇచ్చిన మాటను క్రమంగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలో దాదాపుగా 10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇదే క్రమంలో తాజాగా వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులివ్వగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా…. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సైతం రెగ్యులర్ చేసేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది.
గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడంలో పంచాయతీ కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పారిశుధ్య చర్యలు మొదలుకొని పన్నుల వసూళ్లు చేపట్టడం, హరితహారం,నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాల నిర్వహణ చేపడుతున్నారు. వృద్ధులకు పింఛన్లు తీసుకోవడానికి వేలిముద్రలు రాని పరిస్థితుల్లో కార్యదర్శులే డబ్బులు డ్రా చేసి ఇస్తున్నారు. అయితే వీరిని రాత పరీక్ష ద్వారా రిక్రూట్ చేయగా… మూడేళ్ల తర్వాత క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఐదేళ్లు గడిచినప్పటికీ… ఈ ప్రాసెస్ కాలేదు. దీంతో కొంత కాలంగా రెగ్యూలరైజ్ చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శలు ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రికేసీఆర్ నిర్ణయం తీసుకోవటంతో… వీరి క్రమబద్ధీకరణకు ముందు అడుగు పడింది. ఇక 60 శాతం లోపు స్కోర్ సాధించిన వారి విషయంలో… ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.