KCR Grandson Himanshu: సర్కారీ స్కూల్ రూపు రేఖలు మార్చేసిన కేసీఆర్ మనుమడు హిమాన్షు
KCR Grandson Himanshu: తెలంగాణ సిఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చొరవతో కేశవనగర్ మండల పరిషత్ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. కమ్యూనిటీ యాక్షన్ సర్వీస్‌లో భాగంగా తాను చదువుతున్న పాఠశాలలో సహ విద్యార్ధుల నుంచి విరాళాలు సేకరించి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారు.
KCR Grandson Himanshu: సౌకర్యాల లేమితో సతమతం అవుతున్న ప్రభుత్వ పాఠశాలకు ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు చొరవతో సదుపాయాలు సమకూరాయి. కేశవనగర్ బడికి మహర్దశ వచ్చింది. దాదాపు రూ. 90 లక్షల ఖర్చుతో సౌకర్యాలు కల్పించారు. తాను చదివే పాఠశాలలో నిధులు సేకరించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు చొరవతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ బడికి సకల వసతులు సమకూరాయి. పాఠశాలలో సమస్యలు పరిష్కరించడానికి నిధులను సమీకరించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నెల రోజుల వ్యవధిలోనే గౌలిగూడ మండల పరిషత్ పాఠశాల కొత్త రూపును సంతరించుకుంది. హిమాన్షు పుట్టినరోజు జులై 12న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఆధునీకరించిన పాఠశాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేటీఆర్ తనయుడు హిమాన్షు ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడు. చదువుతో పాటు కమ్యూనిటీ యాక్షన్ సర్వీస్‌లో కూడా హిమాన్షు చురుగ్గా పాల్గొనే వాడు. సహచర విద్యార్థులతో కలిసి గౌలిదొడ్డి కేశవనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించేందుకు ప్రతి శనివారం వెళ్లేవారు.
గత ఏడాది తమ పాఠశాల క్యాస్ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన హిమాన్షు అక్కడి సమస్యలను చూసి వసతులు కల్పించాలని భావించాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్‌ను సంప్రదించి పాఠశాల అవసరాలను గుర్తించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల విద్యార్థుల నుంచి రూ.90 లక్షలు సేకరించి గౌలిదొడ్డి కేశవనగర్ పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభించారు. దాదాపు నెల రోజుల క్రితం పనులు ప్రారంభించారు. కేశవనగర్ మండలపరిషత్ స్కూల్లో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు.
మిత్రులు, సహచర విద్యార్దుల నుంచి సమీకరించిన నిధులతో తరగతి గదులను ఆధునికంగా తీర్చిదిద్దారు. ప్రతిగదిలో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కొత్త కిటికీలు, తలుపులు పెట్టించారు. డిజిటల్ తరగతి గదులనూ అందుబాటులోకి తెచ్చారు. చిన్నారులు కూర్చునేందుకు ఆధునిక బల్లలు సమకూర్చారు. గోడలకు రంగులు వేయించారు. గ్రంథాలయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
పాత గదులతో పాటు అదనంగా రెండు తరగతి గదులను నిర్మించారు. స్కూల్లో బోర్ వేయించారు. విద్యార్దులకు డైనింగ్ రూం, బాలికలు, బాలురు, సిబ్బందికి వేర్వేరుగా మరుగుదొడ్లు, వాష్ ఏరియా అందుబాటులోకి వచ్చాయి. నీటిశుద్ధి ప్లాంటు ఏర్పాటు చేశారు. పాఠశాలకు వసతులు సమకూరడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓక్రిడ్జ్ స్కూల్ నుంచి తమ బడికి ప్రతి శనివారం తమ విద్యార్థులను తీసుకొచ్చి పాఠాలు బోధించే వారని, హిమాన్షు ఇక్కడి సమస్యలను చూసి నిధులను సమీకరించడంతో నెల రోజుల్లోనే పనులు పూర్తయ్యాయని ప్రధానోపాధ్యాయుడు రాములు చెప్పారు.