Junior Panchayat Secretary Commits Suicide: వరంగల్ జిల్లాలో పని చేస్తున్న ఓ మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శిగా ఉన్న శుక్రవారం బైరీ సోనీ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. సమ్మె విరమించి గురువారమే విధుల్లో చేరిన ఆమె.... శుక్రవారం ఈ ఘటనకు పాల్పడ్డారు.
నర్సంపేట మండల కేంద్రానికి చెందిన బైరి సోని(29) ప్రస్తుతం ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి జేపీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సర్వీసు క్రమబద్ధీకరించాలంటూ జేపీఎస్‌లు ఇటీవల చేపట్టిన ఆందోళనల్లోనూ సోనీ పాల్గొన్నారు. తక్షణమే విధుల్లోకి చేరాలంటూ ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 6న విధుల్లో చేరారు. ఉద్యోగ భద్రత లేకపోవటంతో పాటు కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందుల గొడవలు తొడవటంతో సోనీ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. సోనీ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోనీ మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆసుపత్రికి చేరుకున్న తోటి ఉద్యోగులు కంటతడి పెట్టారు. పంచాయతీ కార్యదర్శులు ఆసుపత్రికి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగ భద్రత లేదనే భయం, కుటుంబ ఇబ్బందుల వల్లనే సోని ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ జేపీఎస్‌లు ఆందోళనకు దిగారు. సోని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అంబులెన్స్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు.
ఇక సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ జేపీఎస్ లు ఆరోపిస్తున్నారు.క్రమబద్ధీకరించకపోవటంతో ఉద్యోగ అభద్రతతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. సోనీ ఆత్మహత్య చేసుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్ ల ఆందోళన ఉద్ధృతంగా మారింది. వెంటనే తమని క్రమబద్ధీకరించాలని… అప్పటివరకు తమ పోరాటాన్ని ఆపేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న సోనీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తమను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్‌లు నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జేపీఎస్‌లు తమ నిరసనలను ఆపేసి విధుల్లో చేరాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. 9వ తేదీ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. పలుచోట్ల కొందరు జేపీఎస్ లు విధుల్లో చేరగా… చాలా మంది మాత్రం సమ్మెను కొనసాగిస్తున్నారు.