Narayankhed Politics : అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరనున్నాడని సమాచారం. మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కోరిక మేరకు తన సొంత తమ్ముడు మహారెడ్డి భూపాల్ రెడ్డిని గెలిపించడం కోసం ఎన్నికల ముందే బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విజయపాల్ రెడ్డి, మూడు నెల్లల్లోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు, విజయపాల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడటం ఆ పార్టీకి దెబ్బె అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సంజీవ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
పరాజయం తర్వాత, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి ఇద్దరు కూడా నారాయణఖేడ్ (Narayankhed Politics )నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహారెడ్డి వెంకట్ రెడ్డి కుమారులు. 1972లో నారాయణఖేడ్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిసిన వెంకట్ రెడ్డి, 1983లో తెలుగు దేశం పార్టీలో చేరి, రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన తదనంతరం, తన పెద్ద కుమారుడైన విజయపాల్ రెడ్డి 1994 టీడీపీ టికెట్ పైన పోటీచేసి మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో విజయపాల్ రెడ్డి టీడీపీ టికెట్ పైన పోటీచేయగా, తన తమ్ముడు భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పైన పోటీచేశారు. కానీ ఇద్దరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల కిష్టా రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2016 కిష్టా రెడ్డి చనిపోవడంతో, ఉప ఉన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టా రెడ్డి కుమారుడు పట్లోళ్ల సంజీవ రెడ్డి పోటీచేసి, బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరొక సారి, టీడీపీ టికెట్ పై పోటీ చేసిన విజయపాల్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.
టీడీపీలో ఉంటే రాజకీయ భవిషత్తు లేదని తలచి విజయపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. అయితే, 2018 శాసనసభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వక పోవడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా పార్టీ దూరంగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) నాయకత్వం, జనవాడే సంగప్పకు టికెట్ ఇవ్వడంతో మరొకసారి తాను బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వటంలేదని తరుచూ తన అనుచరుల దగ్గర వాపోయిన విజయపాల్ రెడ్డి చివరికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇన్నిసార్లు పార్టీ మరీనా విజయపాల్ రెడ్డి(Vijaypal Reddy) బీజేపీకి ఏమేరకు ఉపయోగపడతారని ఆ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
(హెచ్.టి.తెలుగు రిపోర్టర్, మెదక్)
సంబంధిత కథనం