TPCC New Incharge: ఇక ఠాక్రే వంతు.. ఇప్పుడైనా 'టీ కాంగ్రెస్' సెట్ అవుతుందా..?
05 January 2023, 14:59 IST
- Telangana Cogress New Incharge News: ఠాగూర్ ఎగ్జిట్ అయ్యారు.. ఠాక్రే ఎంట్రీ ఇచ్చారు. ఇక టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా ఠాక్రే బాధ్యతలు చూడనున్నారు. ఈ నేపథ్యంలో... తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెడుతుందా..? నేతలంతా సమైక్యరాగం వినిపిస్తారా..? ఠాక్రే ముందున్న సవాళ్లేంటి...? అనేవి చర్చనీయాంశంగా మారాయి.
మాణిక్ రావ్ ఠాక్రే
Manikrao Thakre replaces Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్... గత కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సీనియర్లు, జూనియర్లు అనటమే కాదు.. ఏకంగా సేవ్ కాంగ్రెస్ అనే నినాదం వచ్చే వరకు వచ్చింది కథ..! ఇంతలోనే ఢిల్లీ నుంచి డిగ్గీరాజా వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పులు లేనట్లే కనిపించింది. ఇక శిక్షణ తరగతులకు దాదాపు సీనియర్లు అంతా డుమ్మా కొట్టారు. ఇదిలా నడుస్తుండగానే.. ఢిల్లీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ ను తప్పించింది. ఆయన ప్లేస్ లో మహారాష్ట్రకు చెందిన ఠాక్రేను రంగంలోకి దింపింది. ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సెట్ అవుతారా..?
కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లోని నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదీ కాస్త సీనియర్లు, జూనియర్లు అనే వరకు వెళ్లింది. అధ్యక్షుడు రేవంత్ తీరుపై ఆగ్రహంతో ఉన్న సీనియర్లు.. సేవ్ కాంగ్రెస్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరుకావటం లేదు. ఎన్నికల ఏడాది వేళ... ఈ పరిస్థితులు హస్తం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఢిల్లీ దూతగా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చి నేతలతో మాట్లాడారు. సీనియర్ల ఫిర్యాదులను కూడా స్వీకరించారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా ఉండదని.. నేతలంతా కలిసి పని చేయాలని స్పష్టం చేశారు. అయితే రేవంత్ మార్పుగానీ... ఇంఛార్జ్ గా ఉన్న ఠాగూర్ మార్పుగానీ ఉండదని చెప్పకనే చెప్పేశారు. ఈ పరిణామం కూడా సీనియర్ నేతలను మరింత అసంతృప్తికి గురి చేసినట్లు వార్తలు వచ్చాయి. రేవంత్ వైఖరే సరిగా లేదనుకుంటే... మరోవైపు ఇంఛార్జ్ గా ఉన్న ఠాగూర్ కూడా రేవంత్ కు వత్తాసు పలుకుతున్నారనేది సీనియర్ నేతల వాదన. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఠాగూర్ ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఠాక్రేను రంగంలోకి దింపింది. ఫలితంగా పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడే అవకాశం ఉంటుందని అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పడైనా సీనియర్లు విబేధాలను పక్కనపెట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక కొత్తగా వచ్చిన ఠాక్రే... ఓ క్లారిటీతో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిస్థితులపై ఇప్పటికే ఆయన ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ నాయకత్వం కూడా కొంత సమాచారంతో పాటు కీలక అంశాలను ఆయన చేతికి అందజేసే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన ఠాక్రే... పార్టీలోని కుమ్ములాటలపై ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. నేతలనంతా సమన్వయం చేసి... కలిసిగట్టుగా ముందుకెళ్లేలా సమయాత్తం చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ఏడాదిలోకి వచ్చిన వేళ.... ప్రస్తుతం తలపెట్టిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్తుల్లో చేయాల్సిన వాటిపై కూడా కసరత్తు చేసి పలు నిర్ణయాలు కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. రేవంత్ పాదయాత్రపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.
మొత్తంగా సుదీర్ఘ నాయకత్వ అనుభవం ఉన్న ఠాక్రే.... టీ కాంగ్రెస్ ను ఎలా నడిపిస్తారు..? నేతలను ఎలా సెట్ చేస్తారు..? అనేది మాత్రం కొంత కాలం వరకు వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవటంతో కాస్త దూకుడుగానే ముందుకెళ్లే అవకాశం ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.