తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Caste Census : తెలంగాణలో 'కుల గణన' - ఎన్నికల వేళ కీలక ఆదేశాలు

Telangana Caste Census : తెలంగాణలో 'కుల గణన' - ఎన్నికల వేళ కీలక ఆదేశాలు

28 January 2024, 5:10 IST

google News
    • Caste Census in Telangana State : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో 'కుల గణన
తెలంగాణలో 'కుల గణన

తెలంగాణలో 'కుల గణన

CM Revanth Reddy On Caste Census : పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కీలక హామీలను పట్టాలెక్కించాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. ఆరు గ్యారెంటీలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న హస్తం ప్రభుత్వం.... వచ్చే ఫిబ్రవరిలో మరో రెండు స్కీమ్ లను ప్రారంభించాలని చూస్తోంది. ఇప్పటికే ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య బీమా పెంపు నిర్ణయాలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు కీలక పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసి... ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

కుల గణనపై ఆదేశాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కుల గణనపై హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. స్వయంగా రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావటంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... శనివారం కీలక ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సర్వే ద్వారా తెలంగాణలో సామాజికవర్గాల వారీగా జనాభా లెక్కలు అందుబాటులో వస్తాయి. ఇదే అంశంపై తెలంగాణలోని అనేక సంఘాలు ఎప్పట్నుంచో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి.

నిజానికి గత కొంత కాలంగా దేశవ్యాప్తంగానూ కుల గణన అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో బిహార్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా... పూర్తి ఫలితాలను కూడా ప్రకటించింది. ఆ రాష్ట్ర జనాభాలో 63శాతం మంది ఓబీసీలు- ఈబీసీలే ఉన్నారని సర్వేలో తేలింది. బిహార్​ జనాభా సుమారు 13.07 కోట్లు! ఈ జనాభాలో ఈబీసీ (అత్యంత వెనకబడిన వర్గాలు) వాటా 36శాతం. ఓబీసీల వాటా 27.13శాతం. 19.7శాతం మంది ఎస్​సీలు 1.7శాతం మంది ఎస్​టీలు ఉన్నారని పేర్కొంది. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది ప్రభుత్వం. గతేడాది అక్టోబరులో ఈ వివరాలను తెలిపింది.

బీహర్ లోనే కాకుండా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ కుల గణన ప్రక్రియపై సర్కార్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఫిబ్రవరి లోపు డేటా సేకరణ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఆ తర్వాత కులాల వారీగా జనాభా వివరాలను ప్రకటించనుంది.

తదుపరి వ్యాసం