BJP Telangana : ఎంపీ సీట్లపై గురి..! రేపు తెలంగాణకు అమిత్ షా - ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన-union home minister amit shah will be telangana on january 28 ahead of lok sabha polls 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Telangana : ఎంపీ సీట్లపై గురి..! రేపు తెలంగాణకు అమిత్ షా - ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన

BJP Telangana : ఎంపీ సీట్లపై గురి..! రేపు తెలంగాణకు అమిత్ షా - ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 11:32 AM IST

Amit Shah Telangana Tour 2024 Updates : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణపై దృష్టి పెట్టింది బీజేపీ. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు(ఆదివారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకేరోజు మూడు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.

అమిత్ షా
అమిత్ షా (Twitter)

Amit Shah Telangana Tour : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణపై దృష్టి పెట్టింది బీజేపీ నాయకత్వం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా…. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. 2019 ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీలను గెలుచుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చింది బీజేపీ. అయితే మరోసారి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పాగా వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా…. ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మూడు జిల్లాల్లో తలపెట్టిన కీలక సమావేశాల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది బీజేపీ.

అమిత్ షా టూర్ షెడ్యూల్….

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు కేంద్రమంత్రి అమిత్ షా. అక్కడ్నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌ వెళ్లారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత కరీంనగర్‌కు వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకుని…. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నారు. రాత్రికి తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీ పార్టీ… 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగా… ఈసారి ఆ సంఖ్య పెరిగింది. ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో… వచ్చే పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. మోదీ మ్యానియాతో పాటు పలు కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. 2019లో నాలుగు ఎంపీలను గెలిచి సంచలన విజయాలను నమోదు చేసిన బీజేపీ… ఈసారి కూడా ఎక్కువ సీట్లను గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. కీలక నేతలను లోక్ సభ బరిలో ఉంచేలా పార్టీ హైకమాండ్ కూడా కసరత్తు చేస్తోంది. త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై కూడా క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది.

అమిత్ షా టూర్ పై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం మోగించబోతుందని చెప్పారు. ఆదివారం నిర్వహించే బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి 20 వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 నుంచి కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో గ్రామాల వారీగా పాదయాత్ర ఉంటుందని… 20 రోజుల్లో అన్ని మండలాల్లో పర్యటిస్తానని సంజయ్ ప్రకటించారు.

Whats_app_banner