Gangula Nomination: కరీంనగర్‌లో గంగుల నామినేషన్-gangula kamalkar filed election nomination in karimnagar ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Gangula Nomination: కరీంనగర్‌లో గంగుల నామినేషన్

Gangula Nomination: కరీంనగర్‌లో గంగుల నామినేషన్

HT Telugu Desk HT Telugu
Nov 09, 2023 06:36 AM IST

Gangula Nomination: కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని, ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేసిన రోజే హైకోర్టు తీర్పు రావడం దేవుడు కూడా తనకు అండగా ఉన్నాడని భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కరీంనగర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు.

నామినేషన్ వేస్తున్న గంగుల కమలాకర్
నామినేషన్ వేస్తున్న గంగుల కమలాకర్

Gangula Nomination: న్యాయమే దిక్సూచిగా ప్రజాసేవ కోసం పనిచేస్తున్న తనను కరీంనగర్ ప్రజలు ఇప్పటికే వరుసగా ఐదుసార్లు గెలిపించారని, కౌన్సిలర్ గా, కార్పోరేటర్ గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం వెనక ప్రజలతో తనకున్న సాన్నిహిత్యమే కారణమన్నారు. దీన్ని సహించలేని ప్రతిపక్షాలు కుట్రలతో కేసులు వేస్తే న్యాయం తన పక్షాన ఉంది కాబట్టే వీగిపోతున్నాయి అన్నారు. బుధవారం కరీంనగర్‌లో గంగుల నామినేషన్ వేశారు.

ఎన్నికల వ్యయమైన, మరేదైనా న్యాయాన్ని, చట్టాల్ని అత్యంత గౌరవించే వ్యక్తినని మంత్రి గంగుల అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని, కరీంనగర్ లో ప్రజా ప్రతినిధిగా గెలుపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

కరీంనగర్ ప్రజలకు తన జీవిత కాలం రక్తం ధారగా పోసి పని చేస్తానని హమీ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం రాక ముందు కరీంనగర్ అంటే చులకన భావం ఉండేదని, కోట్ల రూపాయలు వెచ్చించి కరీంనగర్ సుందరనగరంగా తీర్చిదిద్దుకున్నామన్నారు.

గత ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తప్పుడు పార్టీలకు ఓట్లు వేసి నేడు భాధ పడే పరిస్థితి వచ్చిందని ,ఇక్కడ అలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన భాధ్యత ఓటర్లదేనన్నారు...తనను నమ్మి గెలిపించిన ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు.

(రిపోర్టర్ గోపికృష్ణ,ఉమ్మడికరీంనగర్ జిల్లా)

Whats_app_banner