Mahabubabad : హాస్టల్ వార్డెన్‌ను చితక్కొట్టిన స్టూడెంట్ బంధువులు.. కారణం ఏంటో తెలుసా?
19 September 2024, 12:06 IST
- Mahabubabad : వార్డెన్ అంటే.. హాస్టల్‌లో ఉన్న పిల్లలకు రక్షణగా ఉండాలి. వారి బాగోగులు చూసుకోవాలి. కానీ.. మహబూబాబాద్‌లో ఓ వార్డెన్ వక్ర బుద్ధి ప్రదర్శించాడు. దీంతో విద్యార్థిని బంధువులు సదరు వార్డెన్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
హాస్టల్ వార్డెన్‌కు దేహశుద్ధి
మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌కు దేహశుద్ధి చేశారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌ను స్టూడెంట్ బంధువులు చితక్కొట్టారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన గాదె రుక్మా రెడ్డి.. ఓ ప్రైవేటు స్కూల్‌లో వార్డెన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు హాస్టల్‌కు వచ్చి వార్డెన్‌పై దాడి చేశారు.
స్కూల్ అవరణంలో వార్డెన్‌ను కొట్టడంతో.. పిల్లలు భయాందోళకు గురయ్యారు. అటు వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ను వెంటనె తొలగించాలని అందోళన చేశారు. విద్యార్థిని బంధువులు ఒక్కసారిగా దాడి చేయడంతో.. అతన్ని ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్‌లో బంధించారు. ఈ వ్యవహారంలో పాఠశాల యాజమాన్యం తీరుపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పు చేసిన వార్డెన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ఉంది. దాంట్లో పని చేస్తున్న మహిళా పీఈటీ తమను దూషిస్తున్నారని విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. తమపై పీఈటీ చేయిచేసుకుంటున్నారని.. అంతే కాకుండా వీడియోలు తీస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌కు చెప్పినా పట్టించుకోలేదని బాలికలు వాపోయారు.
తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. గురువారం సిరిసిల్ల- సిద్దిపేట రహదారిపై విద్యార్థినులు బైఠాయించారు. పీఈటీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ.. కొడుతోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటీని సస్పెండ్ చేసే వరకు తాము రోడ్డుపైనే ఉంటామని స్పష్టం చేశారు.
ఆరోగ్యం బాలేకపోయినా.. తరగతికి వెళ్లడం ఆలస్యమైనా పీఈటీ బూతులు తిడుతున్నారని, కొడుతున్నారని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సుధాకర్, ఎంఈవో రఘుపతి అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు రోడ్డు దిగారు. పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ ఆందోళన చేశారు.
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. డీఈవో రమేశ్‌కుమార్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా గురుకులానికి పంపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీఈటీని సస్పెండ్ చేశారు. సాయంత్రం కలెక్టర్ గురుకులానికి చేరుకొని విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కలెక్టర్ ముందు కూడా కొందరు విద్యార్థులు కంటతడి పెట్టినట్టు తెలిసింది.