Medak District : విధుల్లో లేని సిబ్బంది - రిజిస్టర్ లో మాత్రం సంతకాలు! ముగ్గురిని సస్పెండ్ చేసిన మెదక్ కలెక్టర్-medak collector suspends three medical staff who were not on duty ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak District : విధుల్లో లేని సిబ్బంది - రిజిస్టర్ లో మాత్రం సంతకాలు! ముగ్గురిని సస్పెండ్ చేసిన మెదక్ కలెక్టర్

Medak District : విధుల్లో లేని సిబ్బంది - రిజిస్టర్ లో మాత్రం సంతకాలు! ముగ్గురిని సస్పెండ్ చేసిన మెదక్ కలెక్టర్

HT Telugu Desk HT Telugu
Sep 18, 2024 04:36 PM IST

విధుల్లో లేకున్నా రిజిస్టర్ లో సంతకం చేసిన ముగ్గురు వైద్య సిబ్బందిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్… ముగ్గురిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

మెదక్ కలెక్టర్ తనిఖీలు
మెదక్ కలెక్టర్ తనిఖీలు

రిజిస్టర్ లో సంతకం చేసి, విధులకు హాజరు కాని ముగ్గురు వైద్య సిబ్బందిపై మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సస్పెన్షన్ వేటు వేశారు. మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సిహెచ్ సి ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్య సిబ్బంది, హాజరు పట్టికను పరిశీలించారు.

హాజరు పట్టికలో సంతకం చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనటువంటి ఎంపీహెచ్ ఎస్ లు రమేష్, రాధాకృష్ణ, ఎంపీహెచ్ ఈఓ అబ్దుల్ షకీల్ ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్ వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు - కలెక్టర్

అనంతరం ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగుల గదులు, ఓపి, ల్యాబ్, ఇంజక్షన్ సెంటర్ ను పరిశీలించారు. కాగా ఆసుపత్రికి వచ్చే రోగులకు నిల్చోబెట్టి ఇంజెక్షన్ ఇవ్వడమేంటని కలెక్టర్ రాహుల్ రాజ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స సరిగ్గా చేయడం లేదని ... ఆసుపత్రికి రోగులు వస్తేనే సిబ్బంది ఉద్యోగాలు ఉంటాయని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేసారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

నేరస్తుడికి ఏడాది జైలు శిక్ష:

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో నేరస్తుడికి సిద్ధిపేట ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి స్వాతి రెడ్డి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. వివరాల ప్రకారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన నేతి సంతోష్ గౌడ్ (34) అంబులెన్సు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో 2020 డిసెంబర్ 14 న జాలిగామ అంబేద్కర్ స్టాచ్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న గంగాల పోచయ్య (60) కు అంబులెన్సు ఢీకొట్టడంతో బలమైన గాయాలు అయ్యాయి.

కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగాల పోచయ్య మృతి చెందాడు. అప్పటి గజ్వేల్ ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి అంబులెన్స్ డ్రైవర్ ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ వేశారు.

మంగళవారం కేసు విచారణ అనంతరం నేరస్తునిపై నేరము రుజువైనందున సిద్దిపేట ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి స్వాతి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. నేరస్తునికి శిక్ష పడడానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోమలత, తన వాదనలు వినిపించారు. కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, అభిలాష్, వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ లోకేశ్వర్ కీలక పాత్ర వహించారు. నేరస్తునికి శిక్ష పడడంలో కీలక పాత్ర వహించిన సిబ్బందిని సీపీ అనురాధ అభినందించారని గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా తెలిపారు.