తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Special Sanitation Drive : పల్లెల్లో ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’

Special Sanitation Drive : పల్లెల్లో ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’

HT Telugu Desk HT Telugu

04 February 2024, 6:50 IST

google News
    • Special Sanitation Drive in Telangana : ప్రతి గ్రామంలో ఫిబ్రవరి 7 నుంచి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు మంత్రి సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క సమీక్ష
జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క సమీక్ష

జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క సమీక్ష

Special Sanitation Drive in Telangana : ఫిబ్రవరి 7 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైవ్(స్పెషల్ శానిటేషన్ డ్రైవ్) నిర్వహించాలని, ప్రజలను ముఖ్యంగా యువత, మహిళలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దంలా తయారు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చివరి రోజున గ్రామసభ నిర్వహించాలని, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించాలని సూచించారు. సర్పంచుల పదవీకాలం ముగియడం, గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలు కావడంతో గ్రామ పంచాయతీల పాలన అంశంపై ములుగు జిల్లా కలెక్టరేట్​ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు రోడ్లు శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.

ప్రత్యేక అధికారులకు సంపూర్ణ హక్కులు

గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసి పోయిందని, అందుకు మళ్లీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులతో పాలన సాగించాల్సిందిగా నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామానికి మండలస్థాయి అధికారులను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారికి గ్రామం పై సంపూర్ణ బాధ్యత, హక్కులు ఉంటాయని, ప్రత్యేకాధికారులు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకుని పంచాయతీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని సూచించారు.

మేడారంలో ప్లాస్టిక్​ నిషేధించాలి

మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అదే సమయంలో భక్తులు సైతం జాతరకు ప్లాస్టిక్ తీసుకురాకుండా అవగాహన కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహించే జాతరలో సైతం ప్లాస్టిక్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల రూపకల్పన దిశగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.

రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల ప్రత్యేక అధికారులు తాగునీటి సరఫరా పై దృష్టి పెట్టాలని మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ కార్యక్రమం కింద ప్రతి గ్రామానికి తాగునీరు బల్క్ సరఫరా జరుగుతుందని, గ్రామంలో అంతర్గత సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటి నిధులు కేటాయించిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆయా నిధులతో అవసరమైన పనులు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు.

పచ్చదనం పెంపొందించాలి

గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేలా మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి సూచించారు. అందుబాటులో ఉన్న ఆర్థిక సంఘం నిధులను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ గ్రామాల్లో అవసరమైన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద అధిక మొత్తంలో కూలీలకు పని దొరికేలా చూడాలన్నారు. వర్కింగ్ సైట్ లో ఉపాధి కూలీలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని మంత్రి సీతక్క అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి).

తదుపరి వ్యాసం