Medaram Review: మేడారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీతక్క-minister sitakka conducted a review of medaram festival arrangements ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Review: మేడారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీతక్క

Medaram Review: మేడారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీతక్క

Sarath chandra.B HT Telugu
Feb 06, 2024 07:18 PM IST

Medaram Review: మేడారం జాతీర ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, భక్తులు సంతృప్తిగా అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

మేడారం జాతరపై సీతక్క సమీక్ష
మేడారం జాతరపై సీతక్క సమీక్ష

Medaram Review: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం జాతరపై రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, నేషనల్ హైవేస్, అటవీ శాఖ, గిరిజన శాఖ, ట్రాన్స్ కో, ఇరిగేషన్, ఆర్ డ్బ్లు ఎస్ అధికారులతో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సమీక్ష నిర్వహించారు.

మూడు రోజుల్లో దాదాపు కోటిన్నర భక్తులు సందర్శించుకునే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీతక్క తెలిపారు. 2024 ఫిబ్రవరి 21, 22., 23, 24 తేదీల్లో నిర్వహించనున్న మేడారం జాతర పనుల పురోగతిపై మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పి గౌస్ ఆలం లు జాతర ఏర్పాట్ల గురించి మంత్రికి వివరించారు. మేడారం జాతరకు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల తాకిడి జనవరి చివరి వారం నుంచే మొదలవుతున్నందున, మేడారం జాతర పనులన్నీ జనవరి 20 నాటికి పూర్తి చేయాలని అధికారులను మంత్రి సూచించారు.

అన్ని ప్రభుత్వ శాఖలు ఒక టీమ్ గా, కుటుంబ సభ్యులు గా పని చేయాలన్నారు. అనుకున్న సమయంలో పనులు కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. నిధులను అవసరమైన చోట వినియోగించి, పైసా కూడా వృధా కారాదని, నాణ్యత లో రాజీ వద్దని మంత్రి తెలిపారు ములుగు జిల్లా ప్రధానంగా వ్యవసాయం పై ఆధారపడినది కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వం రైతులకు అందించే ప్రతి పథకం లబ్దిదారులకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

మేడారం జాతరకు వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఇబ్బందులు ఉండకుండా రోడ్లను వేయడానికి, మరమ్మత్తుల చేయడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. మేడారంలో భక్తులకు పార్కింగ్ విషయంలోనూ, వసతుల కల్పనల్లోనూ ఎలాంటి కొరత ఉండకుండా ఏర్పాటు చేయడంలో అటవీ శాఖ అనుమతులు సానుకూలంగా స్పందించాలన్నారు.

గిరిజనులకు సంబంధించిన మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అని, ఇందులో గిరిజనుల సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా జాతరలో ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు శాఖ నుండి జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకావాలని మంత్రి తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత తో మేడారం జాతరను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణ సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఈసారి మేడారం జాతరకు 75 కోట్ల రూపాయలను ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి ఈ 75 కోట్లలో జాతరకు వచ్చే భక్తుల వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నామని అన్నారు. మొత్తంగా ఈసారి మేడారం జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లను సంతృప్తిగా సందర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపి మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్ నాగజ్యోతి, ఐటిడిఎ పిఓ అంకిత్, మేడారం ప్రధాన పూజారి జగ్గారావు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Whats_app_banner