TS Panchayat Elections : ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు లేనట్లే, పల్లెల పగ్గాలు ప్రత్యేకాధికారులకు!-khammam news in telugu ts local body panchayat election postponed due to lok sabha elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Panchayat Elections : ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు లేనట్లే, పల్లెల పగ్గాలు ప్రత్యేకాధికారులకు!

TS Panchayat Elections : ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు లేనట్లే, పల్లెల పగ్గాలు ప్రత్యేకాధికారులకు!

HT Telugu Desk HT Telugu
Jan 24, 2024 04:29 PM IST

TS Panchayat Elections : తెలంగాణలో గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ఈ నెలతో ముగియనుంది. మరో వారంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికల జరిగే అవకాశం ఉంది.

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

TS Panchayat Elections : గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ఈ నెలతో ముగుస్తుంది. దీంతో వీటికి వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా? పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తారా? పర్సన్‌ ఇన్‌ ఛార్జ్ లతో పాలన సాగిస్తారా? లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా? అన్న సందిగ్ధం అందరిలోనూ నెలకొంది. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని తేలిపోయింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ఎన్నికల తర్వాతనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. అప్పటి వరకు ప్రత్యేకాధికారులను నియమించాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వీరి నియామకం కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ఈ నెలాఖరు నాటికి ముగియనుండడంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇటీవలే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గడువులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలకు కనీసం 45 రోజుల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతారు.

స్పెషల్‌ ఆఫీసర్ల చేతికే పగ్గాలు

అయితే ఇప్పటి వరకు అసలు పంచాయతీ ఎన్నికల ప్రక్రియనే మొదలు పెట్టలేదు. ఇంకా పట్టుమని వారం రోజుల గడువు కూడా లేకపోవడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించి వారి ద్వారానే పాలన సాగించేందుకు సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. మండల స్థాయి అధికారులను పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించేందుకు వివిధ కార్యాలయాల నుంచి జిల్లా పంచాయతీ అధికారులు సమాచారం తెప్పించుకుంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనని అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెడుతున్న కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పార్లమెంట్‌ ఎన్నికల తరువాతనే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది. వాస్తవానికి జనవరి నెలాఖరు నాటికి పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియనుంది.

జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు

గతంలో పంచాయతీ ఎన్నికలకు 2019 జనవరి ఒకటో తేదీన నోటిఫికేషన్‌ ఇచ్చి ఉమ్మడి జిల్లాలో జనవరి 21,25,30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన అన్ని పంచాయతీల్లో కొత్తపాలక వర్గాలు కొలువుదీరాయి. దీని ప్రకారం ఫిబ్రవరి నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అలాగే జూన్‌లో మండల పరిషత్‌., జిల్లా పరిషత్‌లకు, డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే పార్లమెంట్‌ ఎన్నికల తరువాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. అలాగే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోగా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటికి రాజకీయ అడ్డంకులు ఉండకూడదని భావిస్తోంది. దీంతో తాత్కాలికంగా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించి వారి ద్వారా పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని యోచిస్తోంది. పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించేందుకు మండల స్థాయి అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, జిల్లాస్థాయి అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మండల పరిషత్‌ సూపరింటెండెంట్లు, మండల విద్యాధికారులు, మండల వ్యవసాయాధికారులు, ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్లు, డిప్యూటీ తహసీల్దార్ల జాబితాలను సేకరిస్తున్నారు.

పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌లు లేనట్లే

గత ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించాలి. ఏదైనా కారణాల వల్ల అలా సాధ్యం కాని పక్షంలో ప్రత్యేకాధికారులను నియమించి పంచాయతీల్లో పాలన కొనసాగించాలి. పదవీ కాలం పూర్తయిన వారిని పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించే అవకాశం కొత్త చట్టంలో లేదు. గతంలో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైతే అప్పటి వరకు పదవిలో ఉన్న వారిని పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి వారి ఆధ్వర్యంలోనే పాలన కొనసాగించేవారు. కానీ 2018 పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని తొలగించారు. గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోతే ప్రత్యేకాధికారులను నియమించి వారి ద్వారానే పాలన కొనసాగించాలనే నిబంధన పెట్టారు. ఒకవేళ పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌లను నియమించాలంటే కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆర్డినెన్స్‌ తీసుకు రావాలి. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలాంటి ఆలోచనేదీ చేయడం లేదు. ప్రత్యేకాధికారుల పాలన వైపే మొగ్గు చూపుతోంది.

బీసీల రిజర్వేషన్లు పెంపు!

పదేళ్ల పాటు పంచాయతీల్లో రిజర్వేషన్లు ఉండే విధంగా పంచాయతీరాజ్‌ చట్టం-2018 రూపొందించారు. ఇప్పటికి దాదాపు అయిదేళ్లు ముగియడంతో అంటే మరో అయిదేళ్ల పాటు పాత రిజర్వేషన్లే కొనసాగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ పెంచుతామని హామీ ఇచ్చింది. 42శాతం బీసీ రిజర్వేషన్‌ పెంచుతామని ఎన్నికల్లో ప్రకటించింది. అలాగే పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో రిజర్వేషన్లలో మార్పులు చేయడం అనివార్యంగా మారింది. దీని ప్రకారం పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు తీసుకువచ్చే అవకాశం ఉంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

Whats_app_banner