Witness Movie Review: విట్నెస్ మూవీ రివ్యూ - పారిశుద్ధ్య కార్మికుల క‌న్నీటి క‌థ‌-witness movie review rohini shraddha srinath social drama movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Witness Movie Review Rohini Shraddha Srinath Social Drama Movie Review

Witness Movie Review: విట్నెస్ మూవీ రివ్యూ - పారిశుద్ధ్య కార్మికుల క‌న్నీటి క‌థ‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 10, 2022 03:10 PM IST

Witness Movie Review: రోహిణిిి(Rohini), శ్ర‌ద్ధాశ్రీనాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విట్నెస్ సినిమా సోని లివ్ ఓటీటీలో విడుద‌లైంది. దీప‌క్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రోహిణి, శ్ర‌ద్ధాశ్రీనాథ్
రోహిణి, శ్ర‌ద్ధాశ్రీనాథ్

Witness Movie Review: రోహిణి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath)ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం విట్నెస్‌. పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లోని స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చిస్తూ ద‌ర్శ‌కుడు దీప‌క్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. సోని లివ్ ఓటీటీలో (Sony Liv)ఈ సినిమా విడుద‌లైంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సందేశాత్మ‌క క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...

Witness Movie- ఇంద్రాణి క‌థ‌...

ఇంద్రాణి (రోహిణి) పారిశుద్ధ్య కార్మికురాలు. భ‌ర్త చ‌నిపోవ‌డంతో కొడుకు పార్తిబ‌న్ లోకంగా బ‌తుకుతుంటోంది. కొడుకును పెద్ద చ‌దువులు చ‌దివించాల‌ని క‌ల‌లు కంటుంది. కానీ ఓ ల‌గ్జ‌రీ అపార్ట్‌మెంట్‌లో మ్యాన్‌హోల్ క్లీన్ చేయ‌డానికి వెళ్లిన పార్తిబ‌న్ ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డంతో చ‌నిపోతాడు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంద‌రూ ప‌లుకుబ‌డి క‌లిగిన వ్య‌క్తులు కావ‌డంతో పోలీసుల‌కు డ‌బ్బులు ఇచ్చి పార్తిబ‌న్‌ను తాగుబోతుగా చిత్రీక‌రించి కేసును త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తారు.

కార్మిక నాయ‌కుడితో పాటు లాయ‌ర్ స‌హాయంతో కోర్టును ఆశ్ర‌యిస్తుంది ఇంద్రాణి. కోర్టు తీర్పు ఇంద్రాణికి అనుకూలంగా వ‌చ్చిందా? కొడుకుకు న్యాయం చేయాల‌ని ఆమె చేసిన పోరాటం ఫ‌లించిందా? ఈ పోరాటంలో ఇంద్రాణికి స‌హాయం చేసిన పార్వ‌తి (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌) ఎవ‌రు? తాను చేసిన న్యాయ పోరాటం కార‌ణంగా ఇంద్రాణి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న‌ది అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

కుల వివ‌క్ష‌...

మ్యాన్‌హోల్స్ శుభ్ర‌ప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఊపిరి ఆడ‌క‌ కార్మికులు ప్రాణాల‌ను వ‌దిలిన సంఘ‌ట‌న‌లు ప్ర‌తి ఏటా జ‌రుగుతూనే ఉన్నాయి. కార్మికులు, కూలీలు మ్యాన్‌హోల్స్‌లోకి దిగి వాటిని శుభ్రం చేయ‌కూడ‌ద‌ని చ‌ట్టాలు చెబుతూనే ఉన్నాయి. యంత్రాల స‌హాయంతో వాటిని క్లీన్ చేయాల‌ని పేర్కొంటున్నా అందుకు త‌గిన సాంకేతికత ఇండియాలో అందుబాటులో లేదు.చ‌ట్టాల‌ను బేఖాత‌రు చేస్తూ అధికారికంగానే కార్మికుల చేత మ్యాన్‌హోల్స్ శుభ్రం చేయిస్తున్నారు. వాటి వ‌ల్ల ప్ర‌తి ఏటా చాలా మంది ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నార‌న్న‌దే విట్నెస్ సినిమా క‌థ‌.

ఎవరిది తప్పు…

ఈ మ‌ర‌ణాల విష‌యంలో త‌ప్పుకు బాధ్య‌త వ‌హించే విష‌యంలో ప్ర‌భుత్వ సంస్థ‌లు ఎలా చేతులు దులుపుకుంటున్నాయి ? జ‌నాభ‌కు స‌రిప‌డిన‌ట్లుగా డ్రైనెజీ సిస్ట‌మ్ డెవ‌ల‌ప్ కాక‌పోవ‌డానికి కార‌ణాలేమిటో ఆలోచ‌న‌ను రేకెత్తించేలా సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్‌. స‌మాజంలో పేరుకు పోయిన కుల వివ‌క్ష అంత‌ర్లీనంగా చాటిచెప్పారు. ఉన్న‌త స్థాయి వ్య‌క్తుల్లో కూడా ఈ వివ‌క్ష ఉంటుంద‌ని చూపించారు.సామాన్యుడికి న్యాయం జ‌ర‌గాలంటే ఎన్నో ఏళ్లు వేచిచూడాల్సిందే అని చూపిన సినిమా ఇది.

న్యాయ పోరాటం...

పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్ని ఓ త‌ల్లి సాగించిన న్యాయ పోరాటం ఆధారంగా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా విట్నెస్ సినిమా ద్వారా చెప్పారు.న‌గ‌రాల్ని ప‌రిశుభ్రంగా ఉంచ‌డం కోసం నిద్రాహారాలు మాని అవిశ్రాంతంగా క‌ష్ట‌ప‌డుతోన్న పారిశుద్ధ్య కార్మికులు ఎలా శ్ర‌మ దోపిడికి గురువుతున్నార‌న్న‌ది ఆలోచ‌నాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు దీప‌క్ విట్నెస్ ద్వారా చెప్పారు. పై అధికారుల ఒత్తిడులు ఎలా ఉంటాయో, వారికి ఎదురుతిరిగితే కార్మికుల‌కు ఎలాంటి క‌ష్టాలో ఉంటాయో చూపించారు(Witness Movie Review).

ఆర్ట్ సినిమా మాదిరిగా...

విట్నెస్ సినిమాలో ద‌ర్శ‌కుడు చ‌ర్చించిన పాయింట్ మంచిది. కానీ పూర్తిగా ఆర్ట్ సినిమా మాదిరిగా తెర‌కెక్కించారు.తెలుగులో అగ్ర నిర్మాత‌గా కొన‌సాగుతోన్న టీజీ విశ్వ‌ప్ర‌సాద్ త‌మిళంలో తొలి ప్ర‌య‌త్నంగా నిర్మించిన సినిమా ఇది. లాభాపేక్ష‌ను ఆశించ‌కుండా ఇలాంటి సందేశాత్మ‌క చిత్రాన్ని నిర్మించ‌డం అభినంద‌నీయం.

రోహిణి జీవించింది...

పారిశుద్ధ్య కార్మికురాలి పాత్ర‌లో రోహిణి అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. త‌న కొడుకుకు న్యాయం జ‌ర‌గాల‌ని పోరాటం చేసే త‌ల్లిగా భావోద్వేగ‌భ‌రిత పాత్ర‌లో జీవించింది. హై క్లాస్ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ కుల వివ‌క్ష‌కు గుర‌య్యే యువ‌తిగా శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌ట‌న బాగుంది.

Witness Movie Review -క‌న్నీటి వ్య‌థ‌ల్ని...

పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్ని వారి క‌న్నీటి వ్య‌థ‌ల్ని వాస్త‌విక కోణంలో చూపించిన సినిమా ఇది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా మెప్పిస్తుంది.

IPL_Entry_Point