Sangareddy Road Accident : కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నిమిషాల్లోనే మృతి!
28 February 2024, 15:41 IST
- Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లా మాసాన్ పల్లిలో ఆగి ఉన్న కారును ఆయిల్ ట్యాండ్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ ఆదే రోజు బోల్తా పడింది. ఈ ఘటనలో మాసాన్ పల్లి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మృతి చెందాడు.
సంగారెడ్డి రోడ్డు ప్రమాదం
Sangareddy Road Accident : మనం చేసే పాప, పుణ్యాలకు కర్మఫలాలను అనుభవించక తప్పదని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో(Sangareddy Accident) వెలుగుచూసింది. నిన్న తెల్లవారుజామున అందోల్ మండలం మాసాన్ పల్లి వద్ద రోడ్డుపై ఆగిఉన్న కారును(Car Accident) అతివేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకున్న డ్రైవర్ కనీసం లారీని ఆపి వారికీ ఏమైందని చూడకుండా తాను ఎక్కడ దొరికి పోతానోననే భయంతో అతి వేగంగా వాహనం నడుపుకుంటూ వెళ్లాడు. ఆ ప్రమాద సంఘటన స్థలం నుంచి సుమారు 25 కి. మీ దూరం ప్రయాణించక ముందే ఆ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి శివారులోని మూలమలుపు వద్ద ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ కర్నె రామ్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాసాన్ పల్లి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిన స్థానికులు, గ్రామస్థులు అందరూ కూడా అతడు చేసిన పనికి కర్మఫలం అనుభవించాడని చెప్పుకుంటున్నారు.
ముగ్గురు స్నేహితులు ఒకేసారి
మాసాన్ పల్లి ప్రమాదంలో జోగిపేటకు (Jogipet)చెందిన ముగ్గురు యువకులు వాజిద్, హాజీ, ముఖ్రం చనిపోవడంతో ఆయా కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి. జోగిపేటకు చెందిన వాజిద్ తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు, ఇతడు ఒక్కడే కుమారుడు. కాగా అతడికి సంవత్సరం కిందటే వివాహ జరగగా ప్రస్తుతం అతని భార్య గర్భవతి. పదేళ్లుగా జోగిపేటలో బైక్ మెకానిక్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో వాజీద్ మృతి చెందడంతో అతని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. హాజీ ఏసీ మెకానిక్ గా పనిచేస్తుండగా, ముఖ్రం చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు ఒకేసారి రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో జోగిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
పటాన్ చెరు అవుటర్ రింగ్ రోడ్ (ORR )పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామ సమీపంలో అవుటర్ రింగ్ రోడ్డుపై బుధవారం జరిగింది. బ్రీజా కారు మేడ్చల్ వైపు నుంచి పటాన్ చెరు వస్తుండగా అదుపుతప్పి డివైడర్ దాటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పఠాన్ చేరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పఠాన్ చెరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.