Hyderabad ORR Accidents : ప్రముఖులను బలితీసుకున్న రోడ్డు ప్రమాదాలు, అత్యధికంగా ఓఆర్ఆర్ పైనే ఘటనలు
Hyderabad ORR Accidents : హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. మితిమీరిన వేగం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఓఆర్ఆర్ సహా హైదరాబాద్ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad ORR Accidents : హైదరాబాద్ లోని రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్(ORR) సైతం అనేక మంది ప్రముఖులను బలి తీసుకున్నాయి. ఈ ఘోర ప్రమాదాల్లో వీఐపీ లతో పాటు వారి కుటుంబాలకు మృత్యువాత పడ్డారు. సినీ నటుడు బాబు మోహన్(Babu Mohan) కుమారుడు పవన్ కుమార్ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత వరకు రోడ్డు ప్రమాదాల కారణంగా అర్ధాంతంగా ఊపిరి ఆగిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు(Road Accidents) విషయంలో కొందరు ప్రయాణిస్తున్న వాహనాలు మితిమీరిన వేగంతో ఉండడం, మరికొందరు సీటు బెల్టు,హెల్మెట్లు ధరించకపోవడం వారి పాలిట శాపాలు అయ్యాయి.
ఏప్రిల్ 22, 2000
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ సమీపంలోని పాల్మకుల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాటి మంత్రి పి. ఇంద్రారెడ్డి దుర్మరణం చెందారు
అక్టోబర్ 12, 2003
అప్పటి రాష్ట్ర కార్మిక కార్మిక శాఖ మంత్రి బాబు మోహన్ పెద్ద కుమారుడు పవన్ కుమార్ రసూల్ పురా నుంచి జూబ్లీహిల్స్ కు బైక్ పై వస్తుండగా...... జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద రోడ్ డివైడర్ ఢీకొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
జూన్ 20, 2010
ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్, హైదరాబాద్ శివారులోని ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హై స్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సెప్టెంబర్ 11, 2011
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కుమారుడు అజాయుద్దీన్ మృతి చెందాడు.
డిసెంబర్ 20, 2011
ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివారులోని మెదక్ జిల్లా కొల్లూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డితోపాటు సుజిత్ కుమార్, చంద్రారెడ్డి అక్కడికక్కడే మరణించారు.
ఆగస్టు 21, 2012
మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఔటర్ రింగ్ రోడ్డుపై దుర్మరణం చెందాడు. ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారు టర్నింగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయన స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు.
మే 17, 2016
మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై రైలింగ్ ను ఢీ కొట్టి బోల్తా కొట్టడంతో వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్య వాణి ,కారు డ్రైవర్ స్వామి దాసు స్పాట్ లోనే కన్ను మూశారు.
మే 10,2017
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణ విద్యా సంస్థల అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖమంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ అతడి స్నేహితుడు రామన్ రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటనలో నిశిత్ కారు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
నవంబర్ 25, 2017
మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారుడు పెర్వరం రాములు మనవడు వరుణ్ పవర్ బంధువులు రాహుల్ పవర్ సహా ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగు రోడ్డుపై ముందు వెళుతున్న ఓ పాల వ్యాను బలంగా ఢీ కొట్టడంతో వీరు మరణించారు.
ఫిబ్రవరి 23,2024
పటాన్ చెరువు సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై సదాశివపేట నుంచి పటాన్ చెరు వైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారులో వస్తుండగా.....ముందు వెళుతున్న ఓ సిమెంట్ మిక్స్ కాంక్రీట్ లారీని వెనక భాగంలో ఢీ కొట్టి అనంతరం కారు అదుపుతప్పి పక్కనే ఉన్న రైలింగ్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం