Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో విషాదం, ఉపాధి కోసం వచ్చి తండ్రి, కొడుకులు మృతి
Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన తండ్రి, కొడుకులు మృతి చెందారు. యజమానులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల కార్మికులు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉపాధి కోసం వచ్చి అనారోగ్యంతో తండ్రి, కొడుకులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రానికి చెందిన అమలాల్ మొహజీ (32), అతని భార్య నర్మద, ఇద్దరు కుమారులు జై మొహజీ (5), అన్షు మొహజీ(2) లతో హత్నూర మండల పరిధిలోని కొత్తగూడెం శివారులో మాన్ సింగ్ ఇటుక బట్టీల వద్ద రెండు నెలలుగా కార్మికులుగా పనిచేస్తున్నారు. అక్కడే తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా అమలాల్ మొహజీ, తన చిన్న కొడుకు అన్షు మొహజీ విరేచనాలతో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్న నయం కాలేదు. దీంతో శనివారం తన యజమాని మాన్ సింగ్ కి చెప్పగా, అతడు వచ్చి తన కారులో చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. బతుకు దెరువు కోసం వచ్చి తండ్రి,కొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇతర రాష్ట్ర నుంచి బతుకు దెరువు కోసం కుటుంబాలతో సహా వచ్చిన కార్మికులను పని చేయించుకుంటున్న యజమానులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వలన ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడంపై బంధువుల విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికైనా యజమానులు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. బాధిక కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గవ్వలపల్లి గ్రామానికి చెందిన రెడ్డి బిక్షపతి (32), సంవత్సరం కింద రూ. 10 నుంచి 15 లక్షల వరకు అప్పు చేసి గవ్వలపల్లి చౌరస్తాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాడు. కాగా ఆ వ్యాపారం సరిగ్గా నడవక ఆర్థికంగా నష్టపోవడంతో, అప్పులు తీర్చే మార్గం కనపడలేదు. దీంతో మనస్థాపానికి గురైన బిక్షపతి శనివారం ఉదయం ఇంట్లో వాటర్ ప్లాంట్ కు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. అక్కడికి వెళ్లి అదే ప్లాంట్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మధ్యాహ్నం అయినా బిక్షపతి భోజనానికి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. చుట్టుపక్కల వారు వచ్చి కిందికి దించి చూసేసరికి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అతని మృతితో కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతుడికి ఒక భార్య,కూతురు,ఒక కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
(హెచ్.టి తెలుగు రిపోర్టర్, సంగారెడ్డి)