తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Rain Alert : భాగ్యనగర వాసులకు అలర్ట్.. హైదరాబాద్‌కు వర్ష సూచన

HYD Rain Alert : భాగ్యనగర వాసులకు అలర్ట్.. హైదరాబాద్‌కు వర్ష సూచన

22 October 2024, 17:36 IST

google News
    • HYD Rain Alert : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అధికారులు వెల్లడించారు. భాగ్యనగరం తోపాటు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వాన పడే ఛాన్స్ ఉందని చెప్పారు. రంగారెడ్డి, వికారాబాద్‌, భువనగిరి జిల్లాల్లో.. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
హైదరాబాద్‌కు వర్ష సూచన
హైదరాబాద్‌కు వర్ష సూచన

హైదరాబాద్‌కు వర్ష సూచన

రాబోయే మూడు గంటల్లో హైదరాబాద్‌కు వర్ష సూచన ఉందని.. వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం.. మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన ఉందని చెప్పారు. రంగారెడ్డి, వికారాబాద్‌, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

రాష్ట్రంలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం ఉంటోంది. ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా.. మరోవైపు వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. తాజాగా.. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.

ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందని అధికారులు వివరించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించారు. ఉత్తర అండమాన్ సముద్రం ఎగువ ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీన ఒడిశా -పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మంగళవారం.. రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు.

ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తదుపరి వ్యాసం