TS Graduate MLC Election 2024 : రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ - ఓటర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..!
26 May 2024, 6:49 IST
- TS Graduate MLC Election 2024 Polling: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరోవైపు ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పలు సూచనలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
TS Graduate MLC Election 2024: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారానికి తెర పడగా, ఇన్నిరోజులు పట్టభద్రుల వద్దకు ఉరుగులు, పరుగులు పెట్టిన అభ్యర్థులు రిలాక్స్ మోడ్ లోకి వచ్చేశారు.
మొత్తంగా ఈ స్థానంలో 52 మంది పోటీలో ఉండగా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంపై గురి పెట్టిన మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారోననే ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
మూడు పార్టీలు ఫోకస్….
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించాలనే ఉద్దేశంతో మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి మొత్తంగా 52 మంది పోటీలో ఉన్నారు.
రాష్ట్రంలో సంపూర్ణ బలంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా పట్ట భద్రుల స్థానాన్ని కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలని చూస్తోంది. ఈ మేరకు మూడు ఉమ్మడి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులకు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడికక్కడ మీటింగ్ లు కూడా నిర్వహించి, పట్టభద్రులకు చేరువయ్యే ప్రయత్నాలన్నీ పూర్తి చేశారు.
ఇక సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ మేరకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఎన్నికను ఛాలెంజింగ్ గా తీసుకుని పూర్తి బాధ్యతలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఆ తరువాత నేరుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించారు.
బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలను ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు ఇన్ ఛార్జ్ లుగా నియమించి, కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
605 పోలింగ్ కేంద్రాలు.. 4.61 లక్షల ఓటర్లు
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 12 జిల్లాల పరిధిలో మొత్తంగా 34 నియోజకవర్గాలున్నాయి. వాటి పరిధిలో మొత్తంగా 4,61,806 మంది పట్టభద్రులు ఓటరుగా నమోదై ఉన్నట్లు అధికార గణంకాలు చెబుతున్నాయి. వారిలో పురుషులు 2,87,007 మంది, మహిళలు 1,74,794 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు.
27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుండగా, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లుండగా, ఐదు సెంటర్లు, జనగామలో 23,320 మంది ఓటర్లకు 27 కేంద్రాలు, హనుమకొండలో 43,483 ఓటర్లు ఉండగా 67, వరంగల్ లో 43,594 మంది ఓటర్లకు 59 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇక మహబూబాబాద్ జిల్లాలో 34,759 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా 36, ములుగులో 10,237 మంది ఓటర్లకు 17, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12,460 మంది ఓటర్లకు 16 సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39,898 మంది ఓటర్లకు 55, ఖమ్మంలో 83,606 ఓటర్లకు 118, యాదాద్రి భువనగిరి లో 33,926 ఓటర్లకు 37, సూర్యాపేటలో 51,293 మందికి 71, ఇక నల్గొండలో 80,559 మంది ఓటర్లకు 97 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ చేసిన అనంతరం ఆయా సిబ్బంది ఎన్నికల కేంద్రాలకు చేరుకోనున్నారు.
ఎవరికి పట్టం కడతారోననే టెన్షన్…
సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికలో గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లు కాగా.. వారంతా ఎవరికి పట్టం కడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైవిధ్యమైన తీర్పునిచ్చిన తీరు కనిపిస్తుండగా, పట్ట భద్రులను ఒడిసి పట్టుకోవాలని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నెల 27 ఎన్నిక జరగనుండగా, పట్టభద్రులు ఎవరికి జై కొట్టారో తెలియాలంటే జూన్ 5వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఓటు వేయడం ఎలా...?
- పట్టభద్రులు ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ తో పాటు ప్రభుత్వం గుర్తించిన 12 రకాల ఐడీ కార్డ్స్ లో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడున్న పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్ పెన్ను ఇస్తారు. కేవలం వారు ఇచ్చిన పెన్ను మాత్రమే ఉపయోగించాలి.
- బ్యాలెట్ పేపర్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేరు పక్కన బాక్స్ లు ఉంటాయి. అందులో ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా ఉన్న డబ్బాలో 1, 2, 3, 4...ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాలి.
- ఓటరు ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2, లేదా 3, 4 ప్రాధాన్య క్రమంలో అంకెలు మాత్రమే వేయాలి.
- మొదటి ప్రాధాన్య ఓటు ఎవరికి వేయలనుకుంటున్నారో వారి ఫోటోకు ఎదురుగా ఉన్న బాక్స్ లో 1వ అంకెను వేయాలి.
- ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటే అంత మందికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
- ఓటర్లు ఓటు వేసేటప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురుగా 1, 2, 3.. ఇలా మార్క్ చేయాలి.
ఓటు వేసేటప్పుడు చేయకూడని అంశాలు….
- బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు ఇవ్వకూడదు. అంటే ఇద్దరికి ఒకే ప్రాధాన్యం కల్పించకూడదు. ఒకరికి వేసిన నెంబర్ మరొకరికి వేయకూడదన్నమాట.
- బ్యాలెట్ పేపర్ పై సంతకం చేయడం, లేదా ఇనిషియల్ వేయటం, పేరు, ఇతర అక్షరాలు ఏమీ రాయకూడదు.
- బ్యాలెట్ పేపర్ పై నంబర్స్ తప్ప పదాల రూపంలో వన్, టూ, త్రీ అని రాయకూడదు.
- 1, 2, 3... ఈ నంబర్స్ తప్ప రోమన్ అంకెలు వాడకూడదు.
- ఓటు వేస్తున్నట్టుగా బ్యాలెట్ పేపర్ పై రైట్ మార్క్ టిక్ చేయడం లేదా ఇంటూ మార్కు పెట్టడం లాంటివి చేయకూడదు.
- బ్యాలెట్ పేపర్ పై ఒక క్యాండిడేట్ కు ఇచ్చిన నెంబర్ మరొకరికి ఇస్తే ఆ ఓటు రిజెక్ట్ చేస్తారు.
- చివరగా ఎన్నికల అధికారి సూచించిన ప్రకారం బ్యాలెట్ పేపర్ ను జాగ్రత్తగా మడత పెట్టి, అక్కడున్న బ్యాలెట్ బాక్స్ లో వేయాలి.
- పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి, ఓటు వేసిన ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధం.
- ఒకవేళ అలా చేస్తే చట్టపరంగా చిక్కులు ఎదురుకోవాల్సి వస్తుంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)