తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vinayaka Chavithi 2024 : హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు.. గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదు.. మరి ఎక్కడ చేయాలి?

vinayaka chavithi 2024 : హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు.. గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదు.. మరి ఎక్కడ చేయాలి?

10 September 2024, 13:26 IST

google News
    • vinayaka chavithi 2024 : జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హుస్సేన సాగర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో గణపతి నిమజ్జనం ఎక్కడ చేయాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ దగ్గర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కట్టిన పోలీసులు.. హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే.. విచారణ కాకముందే హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

హైకోర్టు ఆదేశాలు..

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే.. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని కోరారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చూస్తోందని చెప్పారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

సాగర్ కలుషితం..

ప్రతి సంవత్సరం గణపతి నిమజ్జన కార్యక్రమాలను హుస్సేన్ సాగర్‌లో నిర్వహిస్తారు. అయితే.. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం వేడుకలు జరపకూడదని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వినాయకుడి విగ్రహాల నిమజ్జనంతో.. సాగర్ కాలుష్యం అవుతుందని.. దీని నుంచి చెరువులను, హుస్సేన్ సాగర్‌ను పరిరక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను వేసి.. హుస్సేన్ సాగర్‌ను పూర్తిగా కలుషితం చేస్తున్నారని.. దాన్ని పరిరక్షించాలని హైకోర్టులోఅనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

ఎక్కడ చేయాలి..

వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. గతంలోనే చాలా స్పష్టంగా చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను హుస్సేన సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. అయితే.. కోర్టు ఆదేశాలు ఇచ్చినా... నిమజ్జనం ఇక్కడే చేస్తున్నారని.. మరోసారి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. భక్తుల నుంచి స్పందన వస్తోంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వద్దంటే.. ఎక్కడ చేయాలో చెప్పాలని కోరుతున్నారు.

తదుపరి వ్యాసం