Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు-key directions of telangana high court on disqualification of mlas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలన్న హైకోర్టు.. పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు (Telangana High Court )

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని స్పష్టం చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై.. చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.

2023లో గెలిచిన తర్వాత..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, వివేకానంద గౌడ్‌ పిటిషన్‌ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

సుదీర్ఘ వాదనల తర్వాత..

బీఆర్ఎస్, బీజేపీ వేసిన అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపు అంశంలో సుప్రీం కోర్టు ఆదేశాలను స్పీకర్‌ పట్టించుకోవడం లేదని.. పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. లేకపోతే.. తామే సుమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ నుంచి..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడియం శ్రీహరి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలుపొందారు. తెల్లం వెంకట్రావ్ భద్రాచలం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఏంపీ ఎన్నికల ముందు వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాడుతోంది.

తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలతో.. స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వారిపై అనర్హత వేటు వేయకపోతే.. బీఆర్ఎస్, బీజేపీ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది.