BRS Mlas Car Attack : ఖమ్మంలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కారుపై దాడి
BRS Mlas Car Attack : ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కారుపై దాడి జరిగింది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి ఉన్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
BRS Mlas Car Attack : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన ఉద్రిక్తంగా మారింది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కారుపై దాడి జరిగింది. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు కారుపై రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలే దాడులు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మంచికంటి నగర్‌లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించారు.
దాడి ఘటనపై కేటీఆర్ ఫైర్
ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనంపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి ఉన్న వాహనంపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక, సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే బీఆర్ఎస్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయటం కాంగ్రెస్ కు చేతకాదని విమర్శించారు. సేవ చేసే వాళ్లపై దాడి చేయటం సిగ్గు చేటు అన్నారు.
"బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే, ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం" - కేటీఆర్
దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి- జగదీష్ రెడ్డి
ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ దాడుల తోటి బీఆర్ఎస్ నేతలు భయపెట్టాలని అనుకుంటే అది మీ భ్రమ అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని.. దాన్ని రౌడీయిజంతో అణిచివేయాలని చూస్తున్నారని విమర్శంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ముగ్గురు మంత్రులకు సంబంధం లేకుంటే దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు మీద దాడికి యత్నించారని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
సంబంధిత కథనం