Khammam Floods : ఖమ్మంలో ఎటు చూసినా క'న్నీళ్లే'-khammam floods munneru stream havoc in city many areas submerged ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Floods : ఖమ్మంలో ఎటు చూసినా క'న్నీళ్లే'

Khammam Floods : ఖమ్మంలో ఎటు చూసినా క'న్నీళ్లే'

HT Telugu Desk HT Telugu
Sep 03, 2024 03:33 PM IST

Khammam Floods : మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం కన్నీళ్లు పెట్టుకుంది. ఎటుచూసినా వరద ముంపు ప్రాంతాలే కనిపిస్తున్నాయి. వేలాది మంది కట్టుబట్టలతో మిగిలిపోయారు. కనీసం తాగునీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఇండ్లు చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఖమ్మంలో ఎటు చూసినా క'న్నీళ్లే'
ఖమ్మంలో ఎటు చూసినా క'న్నీళ్లే'

Khammam Floods : ఖమ్మం నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వరదకు చెల్లాచెదురుగా మారిన బాధితుల కన్నీళ్లే తారసపడుతున్నాయి. ఇంకా ఖమ్మం నగరం జల దిగ్భందంలోనే ఉంది. గోదారిలా ఉగ్ర రూపం చూపించిన మున్నేరు ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. 36 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రవహించిన మున్నేరు ఖమ్మం నడి బొడ్డున భయానక వాతావరణమే సృష్టించింది. వరద తాకిడికి ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉండిపోయాయి. వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. కొంచెం వరద తగ్గడంతో బురదలో కూరుకుపోయిన ఇండ్లను చూసి బాధితులు ఘోల్లుమంటున్నారు. విలువైన సామాన్లు కొట్టుకుపోయాయి. తిండి గింజలు, తాగునీరు కూడా లేకుండా వరద ముంచేయడంతో బాధితుల వేదన వర్ణనాతీతంగా మారింది.

ఒకటో అంతస్తు వరకు నీళ్లు రావడంతో ఏం చేయాలో తెలియక కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని బాధితులు వాపోతున్నారు. ఖమ్మం నగరంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో చుట్టూ ఉన్న రామన్నపేట నుంచి దానవాయిగూడెం, బ్రిడ్జి డౌన్, ఎఫ్సీఐ గోడౌన్, ఎంబీ గార్డెన్ పూర్తిగా మునిగిపోయాయి. నయా బజార్ సర్కిల్ నుంచి జూబ్లీ క్లబ్, రైల్వే బ్రిడ్జి వరకు నాలుగు అడుగుల లోతు వరద నీరు వచ్చి చేరింది. బైపాస్ రోడ్ల మీద ఉన్న లారీలు సైతం మునిగిపోయాయి. మోతీనగర్, బొక్కల గడ్డ, నయాబజార్, మంచికంటి నగర్, సుందరయ్య నగర్, ప్రకాశ్ నగర్, శ్రీనివాస్ నగర్ కాల్వకట్ట, ధంసలాపురం నీట మునిగాయి. మూడో పట్టణానికి రంగనాయకుల గుట్ట పెట్టని గోడలా నిలిచింది. ఇదే లేకపోతే గాంధీ చౌక్ నుంచి మొదలకొని ముస్తఫానగర్ మీదుగా జరిగే ప్రమాదం ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. రైల్వే ట్రాక్ దాటి రాపర్తి నగర్, కూరగాయల మార్కెట్ దాక వరద పోటెత్తింది. 30 ఏళ్ల కిందట వచ్చిన వరద కంటే ఇప్పుడు వచ్చిన వరద దారుణమని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. సర్వం కోల్పోయామని బోరుమంటున్నారు.

ఖమ్మంలో వరదలు
ఖమ్మంలో వరదలు

మునుపెన్నడూ ఎరుగని రీతిలో

ముప్ఫై ఏళ్ల క్రితం బైపాస్ రోడ్డు మీదకు మాత్రమే నీళ్లు వచ్చాయి. కానీ తాజాగా మున్నేరు వరద ఖమ్మం చరిత్ర రికార్డ్ నే బ్రేక్ చేసింది. నయాబజార్ సర్కిల్ నుంచి జూబ్లీ క్లబ్, రైల్వే బ్రిడ్జి వరకు నాలుగు అడుగుల లోతు వరద వచ్చింది. బైపాస్ రోడ్ల మీద ఉన్న లారీలు సైతం మునిగిపో యాయి. మోతీనగర్, బొక్కలగడ్డ, నయాబజార్ వెనుక భాగం, మంచికంటి నగర్, సుందరయ్యనగర్, ప్రకాశ్ నగర్, శ్రీనివాస్ నగర్, కాల్వకట్ట, దంసలాపురం కాలనీల్లో ఇండ్లు మొత్తం మునిగిపోయాయి.

హెచ్చరికలేవీ?

శనివారం రాత్రి అతి భారీ వర్షం కురిసింది. దీంతో ఆదివారం ఉదయం నుంచే మున్నేరుకు వరద ఉద్ధృతి మొదలైంది. నిమిషాల వ్యవధిలోనే వరద పెరుగుతున్న తీరును అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఫలితంగానే చుట్టుపక్కల కాలనీల ప్రజలు వరద బీభత్సానికి గురయ్యారు. మున్నేరు వరద రెప్పపాటున రావడంతో రెండు మూడు ఫ్లోర్లు బిల్డింగ్ ఉన్న వారు సైతం పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని సామాన్లు తడిచి ముద్దయిపోయాయి.

ప్రకాశ్ నగర్ లోని టింబర్ డిపోలు నీటిలో కొట్టుకుపోయి నేలమట్టమయ్యాయి. ప్రతి దుకాణంలోని టేకు కర్రలు, మిషన్లు నీటిలో మునిగి భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మున్నేరు పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రతి ఇంటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. 31వ డివిజన్ లో పెద్దమ్మ తల్లి గుడి ప్రాంతంలో మున్నేటికి ఆనుకొని నిర్మించిన వెంచర్ లో ఇండ్లు కట్టుకున్న వారందరికీ వరద కన్నీటిని మిగిల్చింది. 15 అడుగులకు పైగా వరద రావడంతో ఇండ్లలోని సామాన్లు మొత్తం బురదలో చిక్కుకుపోయాయి. ఓ పాల వ్యాపారికి గేదెల మరణం తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇండ్లలో చేరిన వరదను తొలిగించుకునే పనిలో పడ్డారు.

ముగ్గురు మంత్రులపై తీవ్ర ఆగ్రహం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఖమ్మం నగరంలో మున్నేరు ఉద్ధృతి కారణంగా చోటు చేసుకున్న వరద బీభత్స సమయంలో సహాయక చర్యలను చేపట్టడంలో ముగ్గురు మంత్రులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భట్టి విక్రమార్క కేవలం తన నియోజకవర్గమైన మధిరకే పరిమితమయ్యారు. పొంగులేటి, తుమ్మల మున్నేరు పరివాహక ప్రాంతంలో పర్యటించినప్పటికీ సరైన రీతిలో స్పందించి అధికారులను పరుగులు పెట్టించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకుపోయిన తొమ్మిది మందిని కాపాడటంలో స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు విఫలమైన తీరుపై ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి.

సకాలంలో హెలికాప్టర్ ను తెప్పించి ఉంటే తుమ్మలకు క్రెడిట్ దక్కేది. ఒక సాధారణ జేసీబీ డ్రైవర్ సాహసం చేసి రాత్రి 10 గంటల సమయంలో తొమ్మిది మందిని కాపాడటంతో తుమ్మల సమర్ధతపై మరిన్ని విమర్శలు గుప్పుమన్నాయి. గొప్ప సాహసం చేసిన ఆ డ్రైవర్ ను అభినందించడంలో కూడా అధికార పార్టీ ప్రతినిధులు విఫలమయ్యారు. ఆ డ్రైవర్ ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర అభినందించడంతో స్థానిక మంత్రి తుమ్మల మరింత ఇరుకున పడ్డారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

సంబంధిత కథనం