Warangal Police: శభాష్ పోలీస్.. భారీ వర్షంలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ సీపీ
Warangal Police: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాగులు ఉధృతంగా ప్రవహించే ప్రాంతాల్లోనే ఉండి ప్రజలకు సూచనలు చేస్తున్నారు. వరంగల్ సీపీ రంగంలోకి దిగి పలు ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
ఓవైపు భారీ వర్షం.. మరో వైపు ఊహించని వరదలు.. ఇంకోవైపు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు. ఈ నేపథ్యంలో.. వరంగల్ పోలీసులు భారీ వర్షంలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. తన సిబ్బందితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నెక్కొండ - వెంకటాపూర్ మార్గంలో వారు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన సీపీ.. సిబ్బందికి సూచనలు చేశారు. వాహనదారులను అప్రమత్తం చేశారు.
సాయం కోసం ఫోన్ చేయండి..
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. విద్యుత్ స్తంభాలను ఎవరూ తాకొద్దని సూచించారు. కరెంటు విషయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని.. నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
సచివాలయం నుంచి సీఎస్..
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫోకస్ పెట్టారు. సచివాలయం నుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్లు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి.. సూచనలు చేస్తున్నారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను కలెక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకొని.. చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో.. కలెక్టర్ అలెర్ట్ అయ్యారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
ప్రయాణికుల అవస్థలు..
వర్షాలు, వరద కారణంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో పలు రైళ్లు రైల్వే స్టేషన్లలో నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైలు నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను కొండపల్లి స్టేషన్‌లోనే ఆపేశారు. ప్రయాణికులను బస్సుల్లో రాయనపాడుకు తరలించారు.